డ్రగ్స్ కేసులో వినిపిస్తున్న మరొక పేరు ముమైత్ ఖాన్. పోకిరి సినిమాలోని ఒకే ఒక్క ఐటెమ్ సాంగ్ ముమైత్ దశ మార్చేసింది. అప్పటి దాకా బాలీవుడ్ సినిమాల్లో గ్రూప్ డ్యాన్సర్‌గా తెరపై కనిపిస్తూ ఉండేవారు. కానీ పోకిరి దెబ్బతో ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. పూరి సపోర్ట్.. అందాల ఆరబోతకు ఏమాత్రం సంకోచించని తత్వం.. అంతకు మించి మంచి డ్యాన్సింగ్ నైపుణ్యం ముమైత్‌ను మరో సిల్క్‌స్మితగా మార్చేశాయి.
అయితే స్టార్ డమ్ ఎంత వేగంగా వచ్చిందో.. అంతే వేగంగా పడిపోవడం సినీ రంగంలో కామన్. అయితే ముమైత్‌కు లక్ కొంచెం ఎక్కువగానే ఉండటంతో కాస్త ఎక్కువ కాలమే సినీ రంగంలో నిలదొక్కుకుంది. కానీ ప్రస్తుతం టాలీవుడ్‌ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ముమైత్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు విచారణకు హాజరుకావాల్సిందిగా ముమైత్‌కి నోటీసులు జారీ చేశారు. కానీ ఆమె తెలుగు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్‌గా ఉండటంతో విచారణకు వెళ్తుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి.
కానీ బిగ్ బాస్ పర్మిషన్‌తో రేపు ముమైత్ సిట్ విచారణకు హాజరు కానుంది. హిందీ బిగ్ బాస్ పదో సీజన్‌లోనూ కంటెస్టెంట్ స్వామి ఓం కూడా కోర్టు కేసులో విచారణకు హాజరుకావాల్సి ఉండగా అతడికి కూడా అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల విరామం అనంతరం స్వామి ఓం మళ్లీ బిగ్ బాస్ షోలో కొనసాగారు. ప్రస్తుతం ముమైత్ విషయంలోనూ అదే పనరావృతం కానుంది. బాస్ అనుమతి ఇవ్వడంతో రేపు ఉదయం 10 గంటలకు సిట్ ముందు ఆమె హాజరవుతారు.
డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలు వివరాలు సేకరించిన సిట్ అధికారులు ముమైత్‌ను అడగాల్సిన ప్రశ్నలపై ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం. చార్మి తరహాలోనే ముమైత్‌ను కూడా మహిళా అధికారులు విచారించనున్నారు.