దాదా ఆత్మకథలో కేసీఆర్‌

227
Mukherjee recalls KCR turning down berth
- Advertisement -

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ జీవిత విశేషాలను పుస్తక రూపంలో వెలువరించిన సంగతి తెలిసిందే.  ద కొలిషన్ ఇయర్స్  1962-2012 పేరుతో పుస్తకాన్ని విడుదల చేసిన ప్రణబ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి కూడా పుస్తకంలో  ప్రస్తావించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించిన అనంతరం కేంద్ర కేబినెట్‌లో పదవుల పంపకాలపై మిత్రపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్న సందర్భాన్ని గుర్తుచేశారు.

ప్రణబ్‌జీ మీకు నా జీవితాశయం తెలుసు..నాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి..మీరు కేంద్ర ప్రభుత్వంలో నాకు ఏ శాఖను అప్పగిస్తారన్నది అంత ముఖ్యం కాదు..ఏ శాఖ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తా కానీ దయచేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పరిశీలించండి అని తనతో కేసీఆర్ అన్నట్లు ప్రణబ్ పుస్తకంలో వివరించారు.

శివసేన అధినేత బాల్ థాకరేను తాను కలవడం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి నచ్చలేదని పుస్తకంలో తెలిపారు. 2012 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్సీపీ నేత శరద్ పవార్ సూచనతో తాను థాకరేను కలిసానని ప్రణబ్  గుర్తు చేశారు. అప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బాల్ థాకరే, ఆ కూటమి అభ్యర్థిని కాదని నాకు మద్దతు ఇచ్చారు. ఆయన్ను కలవాలా? వద్దా? అని సోనియా గాంధీ, శరద్ పవార్‌ ఇద్దరినీ అడిగా. సోనియా వద్దన్నారు. పవార్ మాత్రం తప్పకుండా కలవాలని సూచించారు. చివరికి సోనియా నిర్ణయాన్ని కాదని, 2012 జూలై 13న బాల్ థాకరేను కలిసేందుకు ముంబయి వెళ్లాను. అందుకు సోనియా గాంధీ నొచ్చుకున్నారు  అని ప్రణబ్ గుర్తు చేశారు.

Mukherjee recalls KCR turning down berth
మరుసటి రోజు ఉదయాన్నే ఢిల్లీలో గిరిజా వ్యాస్ నన్ను పిలిచారు. నేను థాకరేను కలవడం సోనియాకు, అహ్మద్ పటేల్‌కు నచ్చలేదని ఆమె అన్నారు. ఆయన్ను కలవడంలో తప్పులేదని భావించి అలా చేశానని గిరిజాకు వివరించా. ఆ విషయాన్ని అక్కడితే వదిలేయాలని నిర్ణయించుకున్నా. మళ్లీ సోనియా, అహ్మద్ పటేల్ ముందుకు ఆ విషయాన్ని తీసుకెళ్లలేదు అని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు.

ఇక 2012లో రాష్ట్రపతి అభ్యర్ధిగా తనను కాకుండా మన్మోహన్ పేరును కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రతిపాదిస్తారని భావించానని తెలిపారు ప్రణబ్.2012 జూన్ 2న సోనియా గాంధీతో సమావేశమయ్యానని తెలిపారు. ప్రణబ్‌జీ రాష్ట్రపతి పదవికి మిమ్మల్ని మించిన అభ్యర్ధి వేరెవరూ లేరు. కానీ మన ప్రభుత్వంలో మీరు పోషిస్తున్న కీలకపాత్రను విస్మరించలేం..అందువల్ల రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి వేరెవరి పేరునైనా మీరు చెప్పగలరా..? అని సోనియా నన్ను ప్రశ్నించారు. మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా బద్దుడినై ఉంటానని జవాబిచ్చి వచ్చేశాను. అయితే ఆ సమావేశం తర్వాత ఇంటికి వెళ్లాక రాష్ట్రపతి అభ్యర్ధిగా నాటి ప్రధాని మన్మోహన్‌ను ఎంపిక చేసి నన్ను ప్రధానిగా నియమిస్తారేమోనన్న ఆలోచన నాకు వచ్చింది. ఈ విషయంపై ఆమె తీవ్రంగా ఆలోచించారని కూడా నాకు తెలిసింది అని ప్రణబ్ పేర్కొన్నారు.

- Advertisement -