ఎస్టీ, బీసీ-ఈ లకు రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పాస్ కావడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ముస్లీం మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని గులాబీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల మానిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ పై ఇతర రాష్ట్రాల నేతలు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గిరిజన, బీసీ ఈ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేయడంపై…. ఏపీకి చెందిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రిజర్వేషన్ల పెంపు నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నట్లు ఎన్నికల మేనిఫెస్టో చిత్తుకాగితాలు కాదని నిరూపించారని కొనియాడారు.
గిరిజన సోదరులకు రిజర్వేషను శాతం పెంచడం, ముస్లీం సోదరులకు బీసీ ఈ రిజర్వేషన్ ఇవ్వడం కోసం రెండు కమిషన్లు వేయడం, రిపోర్టు తెప్పించుకొని కేబినెట్‌లో పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం చూస్తుంటే అణగారిన వర్గాలకు పాటుబడ్డ మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో మీ ప్రయాణం మరువలేనిది.
పదవులు, ఆస్తులు, జీవితాలే శాశ్వతమన్నట్టు తమ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని, హామీలను నెరవేర్చాలని అడిగితే, లాఠీలతో కొట్టించడం, అక్రమ కేసులు పెట్టి బాధించడం వంటి పనులు చేస్తున్నారని ఇదే లేఖలో చంద్రబాబుపై తన ఆగ్రహాన్ని కూడా ముద్రగడ వ్యక్తం చేశారు. ఇకపై నగదు రహిత ఎన్నికలు నిర్వహించి మరింత పేరును తెచ్చుకోవాలని ముద్రగడ తన లేఖలో కేసీఆర్ ను కోరారు. పదవులు, ఆస్తులు, జీవితాలు శాశ్వతం కాదు… పేరు ప్రతిష్ఠలే శాశ్వతం. శాశ్వతంగా ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ నిలవాలని ఆకాంక్షించారు.