MSG:ప్రీమియర్ షో టికెట్‌@రూ.1.11 లక్షలు

5
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రీమియర్ షోకు సంబంధించిన తొలి టికెట్‌ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీవెంకటరమణ థియేటర్ వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో ఈ తొలి టికెట్‌ను రూ.1.11 లక్షలకు మోకా సుబ్బారావు దక్కించుకున్నారు. ఈ విషయం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది.

మోకా సుబ్బారావు బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. చిరంజీవిపై ఉన్న అభిమానంతో పాటు, సేవా భావంతో ఈ వేలంలో పాల్గొని ఇంత భారీ మొత్తానికి టికెట్‌ కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. వేలం ద్వారా వచ్చిన మొత్తం నగదును చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు విరాళంగా అందజేస్తానని సుబ్బారావు ప్రకటించారు. ఈ నిర్ణయానికి చిరంజీవి అభిమానులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రేమియర్ షో తొలి టికెట్‌ను వేలం వేయడం అనేది చిరంజీవి చిత్రాలకు సంబంధించి సంప్రదాయంగా మారిన విషయం. అయితే ఈసారి రూ.1.11 లక్షలు పలకడం విశేషంగా మారింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి యువతతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై, ఉత్సవ వాతావరణాన్ని సృష్టించారు.

సినిమా విడుదలకు ముందే ఈ స్థాయి క్రేజ్‌ నెలకొనడం ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. చిరంజీవి అభిమానంతో పాటు సేవా కార్యక్రమాలకు తోడ్పడే ఈ తరహా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read:ఫాస్టింగ్‌పై అధ్యయనం..షాకింగ్ నిజాలు!

- Advertisement -