భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెందిన మూడు ఫోన్లను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ విషయంలో ధోనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ద్వారకలోని ‘వెల్కమ్’ ఫైవ్ స్టార్ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తన మూడు ఫోన్లను ఎవరో దొంగిలించారని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా శుక్రవారం రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల ముందు జార్ఖండ్ జట్టు బసచేసిన వెల్కమ్ ఫైవ్ స్టార్ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. బెంగాల్ జట్టుతో జరిగే మ్యాచ్ కోసం ఆటగాళ్లు ఉదయం సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఊహించని పరిణామంతో జార్ఖండ్ జట్టు బిత్తరపోయింది. సకాలంలో ఆటగాళ్లు, అధికారులను వేరే ప్రదేశానికి తరలించడంతో ప్రమాదం తప్పింది.