లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్ పార్లమెంట్ స్ధానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వినోద్ కుమార్. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు నామినేషన్ పత్రాన్ని వినోద్ సమర్పించారు. ఎంపీ వినోద్‌తో మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్ ఉన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ సైతం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
కరీంనగర్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్ విద్యార్ధి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. సీపీఐ అనుబంధ ఏఐఎస్‌ఎఫ్‌లో పనిచేసిన వినోద్ తర్వాత ఆ పార్టీలో వివిధ బాధ్యతల్లో పనిచేశారు.
టీఆర్ఎస్ ఆవిర్భావ సభ్యుల్లో ఒకరు వినోద్. 2004లో తొలిసారి హన్మకొండ పార్లమెంట్ స్ధానం నుండి ఎంపీగా ఎన్నికైన వినోద్ ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుల్లో ఒకరు వినోద్ కుమార్. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులుగా ,లోకసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
నేటి నుండి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 26న నామినేషన్ పత్రాల పరిశీలన,ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 28. ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది.