Congress:కాంగ్రెస్ లో సీట్ల లొల్లి.. షురూ!

39
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీ కాంగ్రెస్ లో సీట్ల పంచాయతీ రోజు రోజుకు మరింత పెరుగుతోంది. ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో నోటిఫికేషన్ కంటే ముందే సీట్ల కేటాయింపు జరపాలని భావిస్తున్నారు హస్తం నేతలు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ లో దాదాపు 306 దరఖాస్తులు నమోదైనట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఆ పార్టీలో పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఎంపీ సీట్ల కోసం పార్టీలోని ఆగ్ర నేతల కుటుంబ సభ్యులు కూడా పోటీ పడుతుండడంతో అసలు సమస్య మొదలైంది. భట్టి విక్రమార్క భార్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు.. ఇలా ఆయా నేతల కుటుంబ సభ్యులే ఎక్కువగా పోటీలో ఉన్నారు. దీంతో వీరికి సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్ లో అంతర్మథనం మొదలెయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే 306 దరఖాస్తులలో ఇతరులను పక్కన పెట్టి ముఖ్యనేతల కుటుంబ సభ్యులకు మాత్రమే సీట్లు కేటాయిస్తే ఇతరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది..

అందుకే ఎంపీ సీట్ల కేటాయింపు కాంగ్రెస్ అగ్రనేతలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా పోటీ నెలకొనగా స్క్రినింగ్ కమిటీ ద్వారా సీట్ల కేటాయింపు జరిపింది అధిష్టానం. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓ కమిటీ ని ఏర్పాటు చేసి ఆ కమిటీ సూచించిన వారికే సీట్లు కేటాయించేలా హస్తం హైకమాండ్ రెడీ అవుతున్నట్లు వినికిడి. పైగా ఈసారి లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ అత్యంత కీలకం కావడంతో ఈసారి తెలంగాణలో కనీసం పది స్థానల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీట్లు కేటాయింపు చాలా కీలకంగా మారింది. మరి తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అసంతృప్త వాదులు బుజ్జగించేలా కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపు ఎలా జరుపుతుందో చూడాలి.

Also Read:బాలీవుడ్ హీరోతో శ్రుతి హాసన్?

- Advertisement -