టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కీసర గుట్ట రిజర్వు ఫారెస్ట్ ను ఎంపీ సంతోష్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్ లో 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఎంపీ సంతోష్ కుమార్. ప్రభుత్వం అటవీ శాఖ ద్వారా అమలు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్దిలో భాగంగా ఈ ప్రాంతంలో ఎకో టూరిజం పార్కును తన సొంత ఎం.పీ నిధులతో తీర్చిదిద్దుతామని ఎంపీ సంతోష్ ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు అద్భుతంగా ఉన్నాయని, పట్టణప్రాంత వాసులు సేదతీరేందుకు, ఆరోగ్యకర జీవనవిధానం అలవర్చుకునేందుకు ఇవి తోడ్పాటునిస్తాయని సంతోష్ అన్నారు. కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని మంచి ఎకో టూరిజం ప్రాజెక్టుగా తీర్చి దిద్ది హైదరాబాద్ వాసులకు బహుమతిగా ఇస్తామన్నారు.
అలాగే రూ. 2.90కోట్లతో అర్బన్ లంగ్స్ పార్కుగా అభివృద్ది చేయనున్నట్లు ప్రకటించారు. ఈసందర్బంగా ఈనెల 29న మంత్రి మల్లారెడ్డితో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ఇందకు సంబంధించి నేటి నుంచి పార్కులో గుంతలు తీసే కార్యక్రమాన్ని ప్రారంభించారు అధికారులు.