నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో కిడ్నీ వ్యాధుల బారినపడి డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు అండగా నిలువాలని, తనవంతు సహాయాన్ని అందించాలని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనలతో నిమ్స్‌లో కిడ్నీ పేషంట్లకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందుతున్న విషయం తెల్సిందే.
ప్రత్యేకంగా 56 బెడ్లు కిడ్నీ పేషంట్ల డయాలసిస్ కోసమే ఉన్నాయి. సోమవారం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి నిమ్స్‌కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారితోపాటు వచ్చిన ఎంపీ సంతోష్ కుమార్ గారు అక్కడున్న డయాలసిస్ యూనిట్‌ను సందర్శించారు. ఈసందర్భంగా అక్కడ ఉన్న నిమ్స్ డైరెక్టర్ మనోహర్, డాక్టర్ గంగాధర్ , డాక్టర్ రమేశ్ తదితరులతో ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల మంది కిడ్నీ బాధితులు డయాలసిస్ కేంద్రాలను ఉపయోగించుకుంటున్నారని, నిమ్స్‌లో డయాలసిస్ కేంద్రాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉన్నదని వారు ఎంపీ సంతోష్ కుమార్‌కు తెలిపారు.
నిమ్స్‌లో బెడ్ల సంఖ్యను మరింత పెంచేందుకు, కిడ్నీ పేషంట్లకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపర్చడానికి తన ఎంపీ నిధులను కేటాయిస్తానని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని సూచించారు. దీంతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ ఆర్ ) కింద కూడా నిధులను సమీకరించుకోవడానికి వీలుందని, దీనికి సంబంధించి కూడా దాతలను తాను రిక్వెస్ట్ చేస్తానని, ఇక్కడ సౌకర్యాలను మెరుగుపరిచి కిడ్నీ బాధితులకు ఇబ్బందులు లేకుండా చేద్దామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో నిమ్స్‌లో డయాలసిస్ కోసం పేషంట్లకు ఆర్టిఫిషల్ కిడ్నీని ఒకేసారి వాడుతున్నామని, రీ యూజ్ కిడ్నీ కిట్లను వాడడం లేదని వైద్యులు తెలిపారు.
ప్రతీ పేషంట్‌కు కొత్తదే వాడుతామని, ఈ తరహా రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా లేదని వైద్యులు తెలిపారు. గతంలో కిడ్నీ పేషంట్లు డయాలసిస్ చేయించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అయ్యేవని, కానీ, ఇప్పుడు నయాపైసా లేకుండా ఉచితంగా డయాలసిస్ చేస్తున్నామని వైద్యులు చెప్పారు. నిమ్స్‌లో డయాలసిస్ యూనిట్ సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా 46 డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ డయాలసిస్ కేంద్రాలు నిలుస్తున్నాయని, రాత్రింబవళ్లు ఇక్కడ డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తునా్నయని వైద్యులు తెలిపారు. డయాలసిస్ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందిని, వైద్యులను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసినా పేద ప్రజల కోణంలో ఆలోచించి చేస్తారనడానికి డయాలసిస్ కేంద్రాలే ఒక ఉదాహారణ అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.