కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ ఫెయిల్యూర్ విషయాన్ని తొలుత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు సుష్మా. అప్పటినుంచి సుష్మా వ్యక్తిగత సిబ్బందికి ఫోన్ల మీద ఫోన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దేశంలోని చాలామంది సుష్మాకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.
తాజాగా సుష్మాస్వరాజ్‌కు కిడ్నీ ఇచ్చేందుకు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ముందుకొచ్చారు. ఈ మేరకు సుష్మాకు లేఖ రాశారు. తన కిడ్నీని స్వీకరించాలని సుష్మాను కోరారు. కిడ్నీ ఇచ్చేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నానని ఆయన లేఖలో తెలిపారు. శుక్రవారం పార్లమెంట్‌లో సుష్మా కార్యాలయంలో రాయపాటి ఈ మేరకు లేఖ అందజేశారు.
సుష్మా రాజకీయాల్లో ఇంకా ఉండాల్సిన అవసరం ఉందని, అటు వంటి నేత దేశానికి ఎంతో అవసరమని, అందుకే తాను కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చానని రాయపాటి మీడియాకు చెప్పారు. కిడ్నీ వైఫల్యం కారణంగా చికిత్స నిమిత్తం నవంబర్ ఏడో తేదీన ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను కిడ్నీ వైఫల్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నానని సుష్మా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైద్యులు ప్రస్తుతం తనకు డయాలసిస్ చేస్తున్నారని, కిడ్నీ మార్పిడి కోసం అవసరమైన పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో తిరిగి కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే… సమస్యల్లో ఉన్న జనం తమ స్పందనను సోషల్ మీడియాలో ప్రస్తావించడమే ఆలస్యం… వారి సమస్యను ఇట్టే పరిష్కరిస్తున్న సుష్మాకు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. సుష్మా త్వరగా కోలుకోవాలని, అవసరమైతే… తమ కిడ్నీలు కూడా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పెద్ద సంఖ్యలో నెటిజన్లు సుష్మా ట్వీట్‌కు రీట్వీట్లు పంపారు. ఇలా కిడ్నీలు దానం చేస్తామంటూ చెప్పిన వారి సంఖ్య వేలల్లోనే ఉన్నట్లు సమాచారం.