తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు అంశాన్ని గత 5రోజులుగా సభ దృష్టికి తెస్తున్నాం.. కేంద్రం తీరుపై ఆందోళన చేపడుతున్నట్లు లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అత్యవసర అంశాల గురించి కేటాయించిన సమయంలో నామా మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇచ్చామని, రైతు బంధు ఎకరానికి 10వేలు ఇవ్వడం.. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందాయన్నారు. దీంతో ఎక్కువ శాతం పంట దిగుబడి పెరిగిందని నామా తెలిపారు. వరి ఉత్పత్తిలో ఇండియాలో నెంబర్ వన్ అయ్యామన్నారు. దాని వల్ల వరి సేకరణ సమస్య ఏర్పడిందన్నారు. తెలంగాణలో ఏడాదికి రెండుసార్లు పంట వేస్తారన్నారు.
ధాన్యం ప్రొక్యూర్మెంట్ కోసం కేంద్రంతో మాట్లాడామని, ఒకసారి తీసుకుంటాం, మరోసారి తీసుకోమని కేంద్రం అంటోందని నామా ఆరోపించారు. ఎఫ్‌సీఐకి కోటా ఇవ్వడంలేదన్నారు. తెలంగాణ రైతులు రోడ్డుమీదపడ్డారని, ధాన్యం సేకరణ గురించి ఆరు సార్లు మీటింగ్ జరిగిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు పలుసార్లు కేంద్రంతో చర్చలు జరిపారన్నారు. ఏడాదికి ఎంత వరిని ప్రొక్యూర్ చేస్తారని నామా అడిగారు. దీంట్లో కోటా కేటాయిస్తే, ఆ విషయాన్ని రైతులకు చెబుతామన్నారు. ఏడాదికి ఎంత కోటా తీసుకుంటారో చెప్పాలని కేంద్రాన్ని కోరారు. దక్షిణ భారత దేశంలో వేడి వాతావరణం వల్ల వరి ముక్కలు అవుతుందని, దాని వల్ల బాయిల్డ్ రైస్‌ను ఫ్రిపర్ చేయాల్సి వస్తుందన్నారు. రైతులు బాగుంటేనే దేశం ఉంటుందని, కరోనా సమయంలో అన్నం పెట్టింది రైతులే అని ఆయన అన్నారు. ఒక్క తెలంగాణ రైతుల సమస్య మాత్రమే కాదు దేశ రైతుల సమస్య ఇది. అందుకే జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించాలని నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.