ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్ లపై ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో ఆయనతో పాటు టీఆర్‌ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర రావు,మిగతా ఎంపీ కూడా ఉన్నారు.
మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్ రైల్వే డబ్లింగ్ పనులు ,విద్యుద్దీకరణ పూర్తి చేయాలి.2015-16 లో 113 కిలోమీటర్‌ల దూరం ,728 కోట్ల రూపాయల అంచనాతో ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది.కానీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. డబ్లింగ్ పనులు పూర్తి చేయడం వల్ల మహబూబ్ నగర్ నుండి సికింద్రాబాద్ వెళ్లే సుమారు మూడు ఉద్యోగులకు,వేలాదిమంది ప్రయాణికులకు గంట సమయం ఆదా అవ్వడంతో పాటు ,రాకపోకలు పెరిగి ప్రాంతం అభివృద్ధి చెందేందుకు వీలు ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు.
అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని రైల్వే స్టేషన్,జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి దివిటిపల్లి రైల్వే స్టేషన్ విస్తరణ,ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వ మెడికల్ కాలేజ్,టూరిస్ట్ స్పాట్ అయిన మయూరి పార్క్, ఐటీ కారిడార్, డబుల్ బెడ్ రూమ్ కాలనీలకు దివిటిపల్లి రైల్వే స్టేషన్ దగ్గరగా వున్నందున అభివృద్ధి చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని.., ఆ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నాయని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అదేవిధంగా మహబూబ్ నగర్ – మునిరాబాద్ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి.1997-1998లో 240 కిలోమీటర్లు ,645 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్ట్ చాల ఏళ్లుగా పెండింగ్‌లో వుంది. వికారాబాద్ – కృష్ణ రైల్వే లైన్ పనులు చేపట్టాలి.సామాజికంగా ఆర్థికంగా వెనకబడ్డ నారాయణపేట మక్తల్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 87కిలోమీటర్ ల రైల్వే పనులు పూర్తి చేస్తే ఈ ప్రాంతాలు అభివృధి చెందుతాయన్నారు.
ఇక గద్వాల్ -మాచర్ల రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలని.1992 లో ప్రాజెక్ట్ మంజూరు అయినప్పటికీ పనులు ప్రారంభించలేదని తెలిపారు.దాదాపు ముప్పై ఏళ్లుగా పెండింగ్‌లో వుంది. ఈ రైల్వే లైన్ పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుంది. అంత్యంత వెనకబడ్డ ప్రాంతాలను కలుపుతూ వెళ్ళే రైల్వే లైన్ కావున నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను అని ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గద్వాల్ నుండి రాయచూరు 57కిలోమీటర్ల రైల్వే లైన్ 46.10 కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సంబంధాలు మెరుగు పడతాయి కాబట్టి ప్రాధాన్యత క్రమంలో దీనిని పూర్తి చేయాలని ఆయన అన్నారు.