ఉద్యమస్పూర్తితో హరిత తెలంగాణను సాధించి తీరుతామని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మొక్కలు నాటారు. హరిత దళాలు ఏర్పాటుచేసి ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఓ వైపు కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అందించాలనే సంకల్పంతో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, అటవీ సంపద పెంపు తదితర అంశాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు.
భవిష్యత్ తరాలకు ఆరోగ్య తెలంగాణను అందించడమే లక్ష్యంగా మొక్కలు నాటాలన్నారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి. మెదక్ జిల్లా రామాయంపేటలోని ఝాన్సీలింగాపూర్‌లో ఆమె మూడో విడత హరితహారంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని కోరారు. మెదక్ జిల్లాలో ఈసారి ఒక కోటి 48 లక్షల మొక్కలు నాటనున్నట్లు ఆమె తెలిపారు.
రాష్ట్రంలో పచ్చదనం పెంచే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి చందూలాల్ అన్నారు. ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు డివిజన్ లో జరిగిన హరితహారంలో మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. గట్టమ్మ ఆలయ ప్రాంగణం, ప్రభుత్వాస్పత్రి, కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో మొక్కలు నాటారు. పలువురు పోలీస్ అధికారులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.