నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి షాక్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు ప్రకటించి తెలంగాణ బీజేపీకి దెబ్బేసిన పవన్ కల్యాణ్ సాగర్ ఉప ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే విషయమై ఆసక్తి నెలకొంది. ఏపీలో బీజేపీ. జనసేనల మధ‌్య పొత్తు ఉంది. కాని గత కొంత కాలంగా బీజేపీ తీరుపై పవన్ కల్యాణ్ తీవ్ర అసహనంతో ఉన్నాడు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతల తీరుపై జనసేన పార్టీ మండిపడుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బండి సంజయ్, అర్వింద్, డికే అరుణ వంటి బీజేపీ నేతలు అసలు తమకు జనసేన పార్టీ మద్దతు అవసరం లేదని, అసలు తెలంగాణలో జనసేన పార్టీ ఎక్కడ ఉందని కించపరిచారు. అయితే బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ల రాయబారంతో పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ప్రకటించాడు. దీంతో హైదరాబాద్‌లోని లక్షలాది మంది జనసైనికులు బీజేపీ విజయం కోసం పని చేసారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత బండి సంజయ్‌లో అహంకారం పెరిగిందని, బీజేపీ విజయం కోసం శ్రమించిన తమకు, తమ అధినేత పవన్‌కు కనీసం కర్టెసీగా చిన్న థ్యాంక్స్ కూడా చెప్పలేదని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు తమ పార్టీని చులకనగా మాట్లాడడం జీర్ణించుకోలేకపోయిన జనసేనాని పట్టభద్రుల ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి, పీవీ కుమార్తె వాణిదేవికి మద్దతు పలికారు. జాతీయ స్థాయిలో బీజేపీతో కలిసి పని చేస్తుంటే పట్టభద్రుల ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ నాయకత్వం తనను సంప్రదించలేదని విమర్శించారు. అందుకే ఆ పార్టీకి మద్దతివ్వబోమని టీఆర్ఎస్ అభ్యర్థులకు జనసైనికులు, తన అభిమానులు ఓటేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో జనసేన అంతగా బలంగా లేకున్న పవన్ ఇచ్చిన స్టేట్ మెంట్ యువతను ప్రభావితం చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అనుకున్నట్లే రెండు ఎమ్మెల్సీ స్థానాలను అధికార టీఆర్ఎస్ గెలుచుకోవడంతో.. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచనలో పడింది. ఎన్నికలలో సీట్లు గెలవకపోయినా పవన్ కల్యాణ్‌ను తక్కువ అంచనా వేయద్దని ఆయన పిలుపు ఇస్తే యువత మొత్తం కదులుతుందని, ఎన్నికలలో విజయావకాశాలు తారుమారుఅవుతాయని ఢిల్లీ పెద్దలు గ్రహించారు. పవన్ కల్యాణ్‌ను అవమానించేలా మాట్లాడిన బండి సంజయ్‌కు బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా క్లాస్ తీసుకుందంట..సాగర్ ఉప ఎన్నికలలో ఎవరితోను పొత్తు లేదని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అధిష్టానం బండిపై ఫైర్ అయిందంట. పవన్‌తో వ్యక్తిగత ఇగోలు ఉంటే పక్కన పెట్టాలని, వెంటనే ఆయనకు సారీ చెప్పి మద్దతు కోరాల్సిందిగా బండికి బీజేపీ పెద్దలు ఆదేశించారని సమాచారం. బండి మాత్రం జనసేన మద్దతు అవసరం లేదంటున్నాడంట…ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో జనసేన అభ్యర్థిని ప్రకటించకపోయినా..ఆయన అభిమానులు ఇక్కడ భారీగా ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో డైరెక్ట్‌గా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించకపోయినా…దివంగత ఎమ్మెల్యే నోములపై గౌరవంతో ఆయన కుమారుడు నోముల భగత్ గెలుపుకు సహకరించాలని జనసేన అధిష్టానం నుంచి సాగర్ జనసేన శ్రేణులకు, పవన్ అభిమానులకు సంకేతాలు అందాయంట…మొత్తంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం జనసేన పరోక్షంగా మద్దతు ఇస్తుందని రాజకీయవర్గాల్లో జరుగుతోంది. పవన్ అభిమానులు, జనసైనికులు బీజేపీపై, ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను అవమానిస్తున్న బండి సంజయ్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే సాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం కసిగా పని చేయనున్నట్లు సమాచారం. మరి ఈ పరిణామాలపై తెలంగాణ బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.