దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు కొనియాడారు. ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా దళితుల కోసం ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు. దళితుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ 10 గంటల పాటు చర్చించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ సమావేశంలో దళితుల అభ్యున్నతిలో భాగంగా సామాజిక, ఆర్థికపరమైన అంశాలపై సీఎం చర్చించి, భరోసానివ్వడం అభినందించదగ్గ విషయమని మోత్కుపల్లి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి అన్న మీరు రావాలని సలహాలు సూచనలు ఇవ్వాలని కోరడం సంతోషం వ్యక్తం చేస్తున్నాను అని మోత్కుపల్లి తెలిపారు.
కులరాహితమైన సమాజం రావడం కోసం మార్పులు అవసరం అని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అయితే సామాజిక భద్రత విషయంలో తీవ్రంగా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారన్నారు. ముఖ్యమంత్రి మనసు పేద ప్రజల పక్షాన నిలవడం సంతోషాన్నిస్తుందన్నారు. రూ. 10 లక్షలు ఒక్క కుటుంబానికి ఇవ్వడం అసాధ్యం కానీ.. సీఎం కేసీఆర్ సుసాధ్యం చేశారని కొనియాడారు. నియోజకవర్గానికి 100 దళిత కుటుంబాలను ఎంపిక చేసి.. రూ. 10 లక్షల చొప్పున ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. గురుకుల విద్యాలయాలు ఎంతో మెరుగుపడ్డాయని మోత్కుపల్లి స్పష్టం చేశారు. ఈ గురుకులాల్లో చదివిన దళిత విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లోనే కాకుండా, విదేశాల్లోనూ విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం సమావేశాన్ని బహిష్కరించాలని అనడం సరియైంది కాదు అని నర్సింహులు అన్నారు. బీజేపీ దళితుల వ్యతిరేక పార్టీ అనే ముద్ర ఉందన్నారు. దళితులకు ఎన్ని లక్షల కోట్లు అయిన ఖర్చు పెడుతా అనడం అభినందనీయం, హర్షించదగ్గ విషయమన్నారు. దళితులకు రూ. 10 లక్షలు ఇస్తాను అన్న మొనగాడు లేడు, సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షించాలి అని చెప్పారు. బీజేపీ లో కొంత మంది వ్యాపారులు చేరారు. వారు చెప్పే విధానం కరెక్ట్ కాదు. వారి మాటలు వింటే పార్టీ ఆగం అవుతుంది అని మోత్కుపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మనసు పేద ప్రజల పక్షాన నిలవడం గొప్ప నిర్ణయం అన్నారు.