ఒకరి ఫోటో మరొకరు తీసే రోజులు పోయి ఎవరికి వారే తమ సెల్ఫీలు దిగే రోజులు వచ్చాయి. దగ్గితే సెల్ఫీ..తుమ్మితే సెల్ఫీ..నవ్వితే సెల్ఫీ..ఏడిస్తే సెల్ఫీ ఇలా చెప్పుకుంటూ పోతే చేతిలో సెల్లు..మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంటే చాలు సెల్ఫీల లోకంలో విహరిస్తోంది నేటి యువత. ఆధునిక సెల్‌ఫోన్ల పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాల్సిన యువత..ఇలా సెల్ఫీల మోజులో పడి ప్రాణాలను తీసుకుంటోంది. సెల్ఫీ తీసుకోవడం ఒక మానసిక జబ్బుగా కూడా తేల్చారు కొందరు. ఇలాంటి వార్తలు నిన్నటిదాకా విన్నాం.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సెల్ఫీ ప్రేమికులకు ఓ మంచి తీపి కబురు లాంటి వార్త ఇది.
సెల్ఫీల గురించి అన్నీ చెడ్డవార్తలే వస్తున్న తరుణంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ మంచి కబురు వెలువడింది. నవ్వుతూ సెల్ఫీలు దిగడం వల్ల మీరు ఆనందంగా ఉండే అవకాశాలు మరింత పెరుగుతాయని… నాలుగువారాలపాటు విద్యార్థుల మీద అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ అధ్యయనంలో బాగంగా 41 మంది విధ్యార్థులకు సెల్ఫీలు తీసుకొని మీ మూడ్ ఎలా ఉందో తెలుపమంటూ పరిశోధకులు విద్యార్థులను కోరారు. అయితే, సెల్ఫీల కోసం లేని నవ్వు తెచ్చిపెట్టుకొని ఫొటో దిగినా.. ఆ రోజు మొత్తం చాలా ఆనందంగా, ఆత్మవిశ్వాసంగా గడిపినట్టు విద్యార్థులు ఈ అధ్యయనంలో వెల్లడించారు.
ఇలా సెల్ఫీలు తీసుకోవడం ద్వారా ఆనందకరమైన ప్రక్రియలో భాగం కావొచ్చునంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్క్ మారినో. ఆయన తన తరగతి గదిలో సెల్ఫీ టేకింగ్ ప్రాజెక్టును నిర్వహించారు. మన ప్రతిబింబాన్ని, మనలోని సుగుణాలను తెలుసుకోవడానికి కాదు.. ఎదుటివారితో మనం ఎలా కమ్యూనికేట్ కావాలన్న విషయంలో సెల్ఫీలు సాయం చేస్తాయని ఆయన చెప్తున్నారు. అయితే అదే పనిగా సెల్ఫీలు తీసుకోవడం కూడా మంచిదికాదని మరో అసోసియేట్ ప్రొఫెసర్ యల్దా ఉల్స్ తెలిపారు.