ఖగోళ చరిత్రలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. గత ముప్పై మూడేళ్లలో ఎన్నడూ జరగనిది… మరో పద్దెనిమిదేళ్ల వరకు జరిగే అవకాశం లేని అద్భుత దృశ్యం… ‘సూపర్ మూన్’ దర్శనమివ్వనుంది. నవంబర్ 14వ తేదీన పిల్లలకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు చందమామ. రోజూ కనిపించేదాని కంటే మరింత పెద్దగా అలరించనున్నాడు. ఆ రోజు భూమికి అతి దగ్గరగా వస్తున్నాడు. మామూలు రోజు కంటే 14శాతం అధికంగా కనిపిస్తాడు. నవంబర్ 14న సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ఈ అరుదైన ఆకాశంలో కనిపించటం ప్రారంభం అవుతుంది. 30శాతం ఎక్కువగా ప్రకాశించనుంది చందమామ.
1948లో ఓసారి ఇలా వచ్చింది. తర్వాత ఇప్పుడే రావటం. మళ్లీ ఇంత పెద్ద చందమామను చూడాలంటే 2034 వరకు ఆగాల్సిందే. నవంబర్ 14వ తేదీన పౌర్ణమి కూడా కావటం విశేషం. ఈ అరుదైన చందమామ చిల్డ్రన్స్ డే రోజు రావటం.. పిల్లలకు గిఫ్ట్ అంటున్నారు శాస్త్రవేత్తలు.భూమికి దగ్గరగా రావటంలో చంద్రుడిపై పరిశోధనలకు శాస్త్రవేత్తలు కూడా రెడీ అవుతున్నారు. భూమికి, చంద్రుడికి మధ్య సాధారణంగా ఉండే దూరం బాగా తగ్గిపోయినప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది.
2008లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సగర్వంగా చంద్రయాన్-1ను ప్రయోగించింది. 1304 కిలోగ్రామాల బరువుండే చంద్రయాన్ హై రెజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ పరికరాలను మోసుకెళ్లింది. చంద్రయాన్-1 ద్వారా చందమామపై నీటి జాడల కోసం వెతికారు. ఈ సందర్భంగా మూన్ మినారాలజీ మ్యాపర్ అక్కడ గణీభవించిన నీటి జాడలను కనుగొంది. అయితే, దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నా.. చంద్రుడిలో నీటి జాడలున్నాయనే విషయానికి చంద్రయాన్ స్పష్టతనిచ్చింది.
నాసా ప్రయోగాలకు చంద్రయాన్ సేకరించిన నమూనాలు పనికొచ్చాయి. చంద్రుడిపై నీటి జాడలున్నట్లుగా వారి పరిశోధనల్లో సైతం తేలింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2తో మిగతా అనుమానాలను పటాపంచలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2018లో చంద్రయాన్-2ను ప్రయోగించే అవకాశం ఉంది.ఇందుకోసం నవంబర్ 14వ తేదీన భూమికి అతిదగ్గరగా చంద్రుడు రానుండటంతో మరిన్ని పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలకు మార్గం సుగమమైంది.