ముగ్గురు వ్యక్తులపై బాంబులు విసిరాయి కోతులు. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఫతేపూర్ కి చెందిన గులాబ్ గుప్తా(60) సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే తన మనవడి కోసం ఇంటి ముందు వేచి చూస్తున్నాడు. తనతో పాటు మరో ఐదేళ్ల మనవడు కూడా ఉన్నాడు. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న కోతులు, తన నోటితో పట్టుకున్న కవర్ ను జారవిడచాయి. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో తాతమనవడితో పాటు.. మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. వీరందరిని ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. కవర్ బ్యాగ్ ని కోతులు జారవిడచాయని.. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఏదైనా చెత్త కుండీలో బాంబుల కవర్ బ్యాగ్ ని ఎవరైనా పడేసి ఉంటారని, ఆ బ్యాగ్ ని కోతులు తీసుకుని.. అటుగా వెళ్తున్న సమయంలో కోతి నోటి నుంచి జారిపడి వీరి మీద పడి ఉండవచ్చని అన్నారు. ప్రస్తుతం బాధితులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, కొద్ది రోజులలో కోలుకుంటారని చెప్పారు.