విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్ర యూనిట్ చేపట్టిన ప్రమోషన్ కార్యక్రమాలతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో ఒక్కసారిగా కన్నప్ప టీం హైప్ పెంచేసింది. ఆ తర్వాత కన్నప్ప నుంచి ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ఇస్తున్న అప్డేట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు భాగమవుతున్నారు.
ఇటీవలి కాలంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. తాజాగా మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మోహన్ లాల్, కిరాట(Kirata) అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుపుతూ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. గంభీరమైన మోహన్ లాల్ లుక్ చూస్తుంటే చిత్ర మేజర్ హైలైట్స్ లో ఈయన క్యారెక్టర్ కూడా ఒకటని స్పష్టమవుతోంది. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
కన్నప్ప మూవీ ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుందని.. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం అని మోహన్ బాబు చెప్పారు. ఎంతో వ్యయప్రయాసతో, భారత దేశంలోని నాలుగు మూలల ఉన్న మహా నటుల్ని ఈ చిత్రంలో తీసుకున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలుంటాయి. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం అన్నారు మోహన్ బాబు. ఈ సినిమాతో విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు ఆరంగేట్రం చేస్తుండటం విశేషం.
Also Read:అప్పులపై తప్పుడు ప్రచారం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు