ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు సినీ నటుడు,శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఛైర్మన్ మోహన్ బాబు. ఏపీ ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం లేదంటూ తిరుపతిలో నిరసనకు దిగిన ఆయన చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు నమ్మించి మోసం చేశాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న పథకాలను అమలు చేయకుండా, కొత్త పథకాలతో చంద్రబాబు మోసాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఒక అబద్దాల కోరు.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన నిరసన ఆగదని, తన విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న బిడ్డల కోసమే ఈ ఉద్యమం అని మోహన్‌బాబు స్పష్టం చేశారు. తమ విద్యాసంస్థలకు రూ. 19 కోట్ల మేర ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఆఖరికి చంద్రబాబుకు స్వయంగా తానే ఉత్తరాలు రాసినా ఫలితం లేదని నిప్పులు చెరిగారు.
మరోవైపు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం చేస్తోందని నిరసిస్తూ మోహన్ బాబు ఇవాళ ఉదయం 10 గంటలకు వేలాది మంది విద్యార్థులతో తమ విద్యాసంస్థల నుంచి తిరుపతి వరకు ర్యాలీ తలపెట్టారు. దీంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆయన ఇంటి చుట్టూ పోలీసులను మోహరించి అడ్డుకున్నారు. ఆయన ర్యాలీ చేయకుండా ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు.