దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్తను తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. కిమ్స్ ఆసుపత్రి వద్దకు సినీ పరిశ్రమ పెద్దలు అక్కడికి తరలివస్తున్నారు. దాసరి మరణవార్త వినగానే ఆసుపత్రికి వచ్చిన మోహన్ బాబు మీడియా ముందే విలపించారు. ‘నకు నటుడిగా జీవితానిచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న.. ఒక చరిత్ర ముగిసిపోయింది.. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఆయన సేవలు మర్చిపోలేనివి.. నాకు నటుడిగా జన్మనిచ్చారు…’ అంటూ ఏదో చెప్పబోతూనే ఉద్వేగంతో కన్నీరు పెట్టుకొని మాట్లాడలేకపోయారు.
దాసరి నారాయణ రావు మృతి పట్ల సినీనటుడు మహేశ్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. దాసరి మరణవార్తను తెలుసుకొని షాక్‌కు గురయ్యానని, ఎంతో బాధ కలిగించిందని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. చిత్ర పరిశ్రమలో ఆయన లేని లోటు ఎప్పటికీ, ఎవ్వరూ భర్తీ చేయలేరని అన్నాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
దాసరి మృతి పట్ల సినీనటులు రజనీ కాంత్, కమల హాసన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాసరి నారాయణ రావు తనకు ఆత్మీయుడు, స్నేహితుడని రజనీ కాంత్ అన్నారు. దేశంలోని గొప్ప దర్శకుల్లో దాసరి ఒకరని, ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. దాసరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. సినీనటుడు కమలహాసన్ స్పందిస్తూ… దాసరి మృతి పట్ల సంతాపం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో దాసరితో గడిపిన రోజులు గుర్తు చేసుకుంటుంటే బాధగా ఉందని అన్నారు. దాసరి లేకపోవడం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటని పేర్కొన్నారు.
చలనచిత్రపరిశ్రమలో ఎందరినో పైకి తెచ్చిన మహానుభావుడు దాసరి అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. చేవెళ్లలోని ఫాంహౌస్‌లో దర్శకనిర్మాత దాసరి నారాయణరావు అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. దాసరి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగేలా సీఎం ఆదేశాలు జారీచేసినట్లు తలసాని తెలిపారు. చలనచిత్ర పరిశ్రమలో పులిలాగ జీవించిన వ్యక్తి దాసరి అని అన్నారు.