ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకొని రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మాల్దీవులు, శ్రీలంక పర్యటనకు శనివారం వెళ్లిన మోదీ ఆదివారం సాయంత్రం నేరుగా తిరుపతికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శనివారమే తిరుమలకు చేరుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు.
ఇక ప్రధాని మోదీ పర్యటన కేవలం రెండు గంటల్లోనే ముగియనుంది. నేటి సాయంత్రం 3 గంటలకు కొలంబో విమానాశ్రయం నుంచి బయలుదేరే ఆయన 4.30 గంటలకు రేణిగుంట చేరుకోనున్నారు. ఆపై బీజేపీ కార్యకర్తల సమావేశం అనంతరం 5 గంటల తరువాత రోడ్డు మార్గాన బయలుదేరి అలిపిరి మీదుగా సాయంత్రం 6 గంటలకు తిరుమలకు వస్తారు.
ఆ వెంటనే మహాద్వారం గుండా శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునే ఆయన, 7.20 గంటలకెల్లా రేణిగుంటకు బయలుదేరుతారు. 8.10కి స్పెషల్ ఫ్లయిట్ లో ఢిల్లీకి తిరిగి బయలుదేరనున్నారు. కాగా, మోదీ పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శనివారం నాడు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకూ ట్రయల్ రన్ నిర్వహించారు.