ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎం. వెంకయ్యనాయుడు పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడిని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందించారు.అనంతరంముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య పేరును ఖరారు చేశామని తెలిపిన మోడీ.. తమకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ని కోరారు. అయితే, దీనిపై స్పందించిన కేసీఆర్ తాము మద్దతు ఇచ్చే అంశంపై నేడు ఓ ప్రకటన చేస్తామని తెలిపారు.
ఎన్డీఏ తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడి పేరును ప్రకటించడం పట్ల తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. ఓ తెలుగు వ్యక్తికి ఈ అవకాశం ఇవ్వడం సంతోషకరమని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా వెంకయ్య నాయుడికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆయనకు మద్దతు తెలిపే అంశంలో టీఆర్ఎస్ పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మరోపక్క, వెంకయ్య నాయుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
వెంకయ్యకు ఉన్న పార్లమెంటరీ అనుభవం క్రియాశీలకం కానుందని, ప్రజా జీవితంలో ఎంతో అనుభవం గడించిన నేత వెంకయ్య అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెంకయ్య ఓ రైతు బిడ్డ అని, ఆయనకు ఉన్న సుదీర్ఘ పార్లమెంటు అనుభవంతో రాజ్యసభ ఛైర్మన్ గా కీలక భూమిక పోషిస్తారని, చాలా ఏళ్లుగా వెంకయ్య తనకు తెలుసని మోదీ అన్నారు. కీలకమైన రాజ్యసభలో వెంకయ్య నాయుడి సేవలు అత్యావశ్యకమని పేర్కొన్నారు. వెంకయ్య నిరంతర శ్రమ తనను ఆకట్టుకుందని, అందుకే తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు సరైన వారని భావించామని తెలిపారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు వన్నె తెస్తారని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడికి పలువురు నేతలు పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు ఉదయం 11 గంటలకు వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.