ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. సర్థార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీలో జరిగిన డీజీపీ, ఐజీపీల సదస్సులో శనివారం మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 26/11 ముంబై దాడులను ఆయన తన ప్రసంగంలో గుర్తుచేశారు. పోలీసులు తీవ్రవాదులతో ధ్యైర్యంగా పోరాడారని కొనియాడారు. అలాగే విధి నిర్వహణలో 33,000 మందికి పైగా పోలీసులు అమరులైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
రెండు రోజుల పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం సాయంత్రం తిరుగుపయనమయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు సీఎం కేసీఆర్‌తోపాటు గవర్నర్, మంత్రులు, డీజీపీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్, గవర్నర్‌లతో మోదీ కాసేపు ఏకాంతంగా మాట్లాడారు.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమ్ముడు ప్రహ్లాద్‌మోడీ సైతం ఇవాళ హైదరాబాద్‌లో గడిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో మోడీ పర్యటించగా… సాధారణ సందర్శకుడిలా ప్రహ్లాద్ మోడీ పాతబస్తీలో కలియతిరిగారు. ప్రహ్లాద్‌మోడీ ఈ ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమొహల్లా ప్యాలెస్‌ను సందర్శించారు.