నల్లధనంపై యుద్ధం ప్రకటించిన ప్రధాని, నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ముందు కూడా బ్లాక్ మనీపై యుద్ధం కొనసాగుతుందని పేర్కొన్నారు. నల్లధనం మోడీ అనుకున్నట్టుగానే మున్ముందు మరిన్ని షాకులిచ్చేందుకు కేంద్రం సిద్దమవుతోంది. నగదు రహిత లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోడీ అందుకు తగిన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.
జనవరి 1 నుంచి బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం (పెద్దనోట్ల రద్దుకు ముందు) మన ఖాతాలో ఉన్న సొమ్ముపై పూర్తి హక్కు మనదే. బ్యాంకుకు వెళ్లి మొత్తం సొమ్మును ఒకేసారి వితడ్రా చేసుకునే హక్కు ఉంది. ఇకముందు… దీనిపై గరిష్ఠ పరిమితి విధించనున్నట్లు తెలిసింది. సేవింగ్స్ ఖాతాల్లోంచి రోజుకు 50 వేల రూపాయలు, కరెంట్ అకౌంట్ నుంచి రోజుకు లక్ష రూపాయలకంటే మించి వితడ్రా చేసుకునే అవకాశం లేకుండా కట్టడి చేయనున్నట్లు సమాచారం. ఇంతటితో సరిపెట్టకుండా… బ్యాంకు లావాదేవీలపై పన్ను (బ్యాంక్ ట్రాన్సాక్షన్ టాక్స్) విధించాలన్న ప్రతిపాదనకు మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఖాతాదారులు బ్యాంకు నుంచి నగదు విత్‌డ్రా చేసిన ప్రతిసారీ కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంకుల్లో వేయకేండా డబ్బును దాచుకుందామన్నాకుదరదు. వ్యక్తులు, సంస్థలు తమ వద్ద గరిష్ఠంగా ఉంచుకునే నగదు పరిమితిపైనా ఆంక్షలు విధించే అవకాశముంది. ఈ పరిమితి కనీసం 3 నుంచి 5 లక్షల వరకు ఉండే అవకాశముంది. ఇక నుంచి ప్రతి లావాదేవీ బ్యాంకుల ద్వారానే జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే నెల 30తో నోట్ల డిపాజిట్ గడువు ముగియగానే ఈ సరికొత్త ఆంక్షలు విధించేందుకు సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు… గత తొమ్మిది పది రోజుల్లో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్లుగా జమయ్యాయి. బ్యాంకులు ఈ పది రోజుల్లో బయటకు వదిలిన మొత్తం మాత్రం లక్ష కోట్ల రూపాయలు మాత్రమే అని అంచనా.