సరిహద్దుల్లో అనునిత్యమూ అప్రమత్తంగా ఉండి కాపలా కాస్తున్న జవాన్లకు ఈ దీపావళిని అంకితమిద్దామని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో రేడియో ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలదంరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దివాళి పండుగను జవాన్లకు అంకితమిద్దామని తెలిపారు. దేశాన్ని రక్షించే జవాన్లకు మద్దతుగా నిలిచే ప్రజలకు మోదీ ధన్యావాదాలు తెలిపారు. దేశంలోకి ఉగ్రవాదులను చొరబడనీయకుండా చూస్తున్న జవాన్ల సంక్షేమం కోసం పాటుపడదామన్నారు.నేటి రాత్రి ప్రతి ఇంటా జవాన్ల క్షేమాన్ని తలస్తూ ఓ దీపాన్ని వెలిగించాలని విజ్ఞప్తి చేశారు.
దేశ ప్రజలంతా ఐక్యత కోసం కృషి చేయాలని కోరిన ఆయన, నేడు వెలిగించే దీపాలతో చీకట్లన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులంతా దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారని, చెడుపై జరిగే పోరాటంలో ఎల్లప్పుడూ మంచే విజయం సాధిస్తుందని అన్నారు. దీపావళి పండుగను ఇప్పుడు ప్రపంచమంతా జరుపుకుంటున్నారని, ఈ పండుగ ప్రజలందరినీ ఒకచోటకు చేరుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఆక్టోబర్ 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని జరుపుకుంటున్నామని, అదేవిధంగా ఇందిరాగాంధీని స్మరించుకుంటున్నామని చెప్పారు. దేశ ప్రజల ఐక్యత కోసం సర్దార్ పటేల్ పోరాడారని, తపించారని గుర్తుచేశారు. ఆయన జయంతి సందర్భంగా దేశ ఐక్యత కోసం మనమంతా కృషి చేయాల్సిన అవసరముందన్నారు.