నితీశ్ తీసుకున్న నిర్ణయాన్ని125 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీటు చేశారు.. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నిమిత్తం ఆయన తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, నితీశ్ కు అభినందనలు తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నబీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పదవికి రాజీనామా చేయకపోవడంపై తలెత్తిన విభేదాల నేపథ్యంలో కొంచెం సేపటి క్రితం సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అంతకుముందు బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మట్లాడారు.. గవర్నర్ కలిసి తన పదవికి రాజీనామా పత్రాన్ని సమర్పించానని చెప్పారు. తగిన ఏర్పాట్లు చేసే వరకు రాజ్యాంగబద్దంగా ఈ పదవిలో కొనసాగుతానని అన్నారు. బీహార్ అభివృద్ధే తన జీవితాశయమని, ఆ పని చేయలేనప్పుడు ఆ పదవి తనకు అనవసరమని, ఇప్పటివరకు తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
ప్రభుత్వాన్ని నడపగలిగినంత కాలం నడిపానని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపించేందుకు తన అంతరాత్మ అంగీకరించలేదని, అందుకే, తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. బీహార్ ప్రజల అభివృద్ధి కోసం పని చేశానని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నించానని చెప్పారు. బీహార్ ప్రయోజనాల కోసమే తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తన నిజాయతీని నిరూపించుకోవాలని, ఆయనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తేజస్విని అడిగానని చెప్పారు. కాగా, బీహార్‌లో మొత్తం శాసనసభా స్థానాల సంఖ్య 243 కాగా, ప్రభుత్వం ఏర్పరచాలంటే కావాల్సిన కనీస మెజార్టీ స్థానాల సంఖ్య 122. జేడీయూ – 71 స్థానాలు, ఆర్జేడీ -80 స్థానాలు, బీజేపీ -53 స్థానాలు, కాంగ్రెస్ -27 స్థానాలు, ఎల్జేపీ -2 స్థానాలు, ఇతరులు -10 స్థానాలు.. నితీష్ మళ్లీ సీఎం పదవి దక్కించుకోవాలంటే బీజేపీ మద్దతు కావాల్సిందే. లేకపోతే ఎన్నికలకు పోవాల్సిందే..