గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజెపీ విజయానంతరం మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని, బీజేపీ పట్ల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకానికి తాను శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు ట్వీట్ చేశారు మోదీ.
రెండు రాష్ట్రాలను అభివృద్ధిపథంలో నడిపిస్తామని, నిరంతంరంగా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రెండు రాష్ర్టాల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ఆయన సెల్యూట్ చేశారు. కార్యకర్తల వల్లే ఆ రాష్ర్టాల్లో విజయదుందుబీ మోగించినట్లు ఆయన చెప్పారు.
ఇదే క్రమంలో రాహుల్‌గాంధీ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. రెండు రాష్ర్టాల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వాలకు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. తన పట్ల ప్రేమను ప్రదర్శించిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు థ్యాంక్స్ చెబుతున్నట్లు రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ సోదరసోదరీమణులు తాను గర్వపడేవిధంగా వ్యవహరించారని, వారు చాలా విభిన్నమైన వారని, హుందాతనంతో ఎన్నికల్లో పోరాటం చేశారని, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం తన శౌర్యం, హుందాతనంలోనే ఉందని నిరూపించారని రాహుల్ తన ట్విట్‌లో కార్యకర్తలను కీర్తించారు.
కాగా..అమిత్ షా రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఓటర్లు తమ పార్టీపై విశ్వాసం ఉంచారని అన్నారు. కోట్లాది మంది కార్యకర్తలు రేయింబవళ్లు శ్రమించడం వల్లే విజయం సాధ్యమైందని,ఇది కార్యకర్తల గెలుపుగా ఆయన వర్ణించారు.
గుజరాత్‌లో కులం కార్డుతో గెలవాలనుకున్న కాంగ్రెస్‌ను ఓటర్లు తిరస్కరించారని, హిమాచల్‌ప్రదేశ్‌లో అవినీతిని ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. కుల, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలకు ఈ ఎన్నికలు గుణపాఠం చెప్పాయన్నారు. కాంగ్రెస్‌తో హోరాహోరీ పోరు జరగలేదని, తాము పూర్తి ఆధిక్యం సాధించామన్నారు. అంతేకాకుండా 2019 సాధారణ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందని అమిత్ షా అన్నారు.
…