ఖైదీ 150తో వందకోట్లు వసూల్ చేసిన చిరు తన 151వ సినిమాతో కూడా తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది.
అయితే ‘సైరా’ చిత్రానికి సంగీత దర్శకుడిగా మొదట ఏఆర్ రెహమాన్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ చిత్రాన్ని చేయలేనని ఆయన స్వయంగా చెప్పాడు. దీంతో ‘సైరా’ మోషన్ పోస్టర్ కు సూపర్ హిట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ఎస్ఎస్ తమన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే, దాదాపు రూ. 150 కోట్ల భారీ వ్యయంతో నిర్మించే చిత్రానికి తమన్ సరిపోడని భావించిన రామ్ చరణ్, తమన్ కు ఇదే విషయాన్ని చెప్పి పక్కకు తప్పించినట్టు సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
అయితే తమన్ తరువాత ‘సైరా’ సంగీత దర్శకుడిగా కీరవాణిని సంప్రదించినట్టు సమాచారం. ‘బాహుబలి’ వంటి భారీ చిత్రానికి కీరవాణి అందించిన నేపథ్య సంగీతం అందరినీ అలరించిన నేపథ్యంలో, చారిత్రక నేపథ్యమున్న ‘సైరా’కు ఆయనే సరైన చాన్సని మెగా ఫ్యామిలీ భావిస్తోందట. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, గతంలో చిరంజీవి, కీరవాణి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రావడం, తాజా ‘బాహుబలి’ కీరవాణికి ఈ మెగా చాన్స్ ను దగ్గర చేసినట్టు తెలుస్తోంది.