త్వరలో శాసనమండలిలో 16 స్ధానాలకు ఎన్నికలు కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి చివరి వారంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండగా టీఆర్ఎస్‌లో ఆశావాహుల సందడి నెలకొంది. ఇక ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌కు ఒక్కస్థానం దక్కే అవకాశం ఉండటంతో ఆ ఒక్కరు ఎవరా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది.
ఆశావాహుల్లో సీనియర్,జూనియర్ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు అధిష్టానం వద్ద తమకు కేటాయించాలని విన్నవించుకుంటున్నారట. జానారెడ్డి,రేవంత్ రెడ్డి,పొన్నాల లక్ష్మయ్య,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి, డి.కే అరుణ, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, పొన్నం ఇలా ఒకరేంటి సీనియర్ నాయకులంతా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఢిల్లీకి క్యూ కడుతున్నారు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్ధానం దక్కించుకోవాలంటే 17 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలున్నారు. గత ఎన్నికల్లో ఆవకాశం దక్కని నేతలు కూడా.. ఆ ఒకే ఒక్క ఛాన్స్ తమకే దక్కుతుందన్న ఆశలో ఉన్నారు. మొత్తానికి వచ్చేది ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఆశావాహుల లిస్ట్ చాంతాడంత ఉండటంతో హైకమాండ్ ఎవరిపై దయ చూపిస్తుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.