కాంగ్రెస్‌ వర్సెస్ ఎంఐఎం..ఆ సీటు ఎవరిది..?

247
mim vs congress
- Advertisement -

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా టీఆర్ఎస్ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. మరోకటి మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది. దీంతో ఒక్కస్థానం దక్కుతుందని ఆశీంచిన కాంగ్రెస్ నేతలకు పోటీ తప్పేలా కనిపించడం లేదు.

హోంమంత్రి మహమూద్ అలీ,మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్,తన రాజకీయ సలహాదారు,మైనింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శేరి సుభాష్‌ రెడ్డితో పాటు గతంలో హామీ ఇచ్చిన విధంగా కురుమ సామాజిక వర్గానికి చెందిన ఎగ్గే మల్లేష్‌కు అవకాశం కల్పించారు. ఇక ఐదో స్ధానాన్ని మజ్లిస్‌కు కేటాయించిన సీఎం మరో రాజకీయ సమరానికి తెరలేపారు.దీంతో ఐదో స్థానం ఎవరికి దక్కుతుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

119 స్ధానాలున్న తెలంగాణ అసెంబ్లీలో ఆంగ్లో-ఇండియన్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌తో కలిసి ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 24 ఓట్లు అవసరం. అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్ధానాలు గెలిచింది టీఆర్ఎస్‌. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు,స్టీఫెన్‌ సన్‌ ఓటుతో కలిపి ఆ పార్టీ బలం 91కి చేరింది. మజ్లిస్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో నలుగురు అభ్యర్థుల్ని గెలుచుకోవడం పక్కా.

కాంగ్రెస్‌ సభ్యులు 19 మంది, టీడీపీ ఇద్దరు, బీజేపీకి ఒకరు ఉన్నారు. వాళ్లందరూ కలిసినా ఓట్ల సంఖ్య 22. బీజేపీ సభకు గైర్హాజరవుతుందని ప్రచారం జరుగుతుండగా టీడీపీలో ఒకరు అధికార టీఆర్ఎస్‌కు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ బలం 20కి చేరనుంది. ప్రతిపక్షం మరింత వీక్ అవడం అదే సమయంలో అధికార పార్టీకీ ఫుల్ మెజార్టీ లేకపోవడంతో ఐదో సీటు ఎవరు గెలుచుకుంటారో అన్న సందిగ్దం అందరిలో నెలకొంది.

ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా మార్చి 1న నామినేషన్ల పరిశీలన, మార్చి 5న ఉపసంహరణ, మార్చి 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అదేరోజు సాయం త్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. కాంగ్రెస్‌లో ఆశావహులు చాలామందే కనిపిస్తుండటంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో గెలిచేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తారో అన్నది పొలిటికల్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

- Advertisement -