యాసంగిలో పండించే పంటను కొంటారా..కొనరా సూటిగా చెప్పాలని బండి సంజయ్‌ని డిమాండ్ చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ భవన్లో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శులు సోమ భరత్, తాతా మధులతో కలిసి మాట్లాడిన పల్లా… బీజేపీ ధాన్యం కొనుగోలు పై కనీస అవగాహన లేకుండా ధర్నాలు చేస్తోందన్నారు.
నిన్నటి వరకు 3550 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచాం… అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. డబ్బులు కూడా రైతులకు జాప్యం లేకుండా చెల్లిస్తున్నాం… బీజేపీ నాయకులు సోయి- జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కనీస జ్ఞానం లేని వ్యక్తి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడం దురదృష్టకరం అన్నారు. బీజేపీ నాయకులు కేంద్రప్రభుత్వం కార్యాలయాలు- ఢిల్లీలో ధర్నాలు చేయాలన్నారు. ధర్నాలు చేసేది మారువేషంలో బీజేపీ నాయకులే…రైతులు కాదన్నారు.
2019- 20 లో 1కోటి 19లక్షల మెట్రిక్ టన్నులు- గత ఏడాది 1కోటి 40లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రానికి తెలంగాణ ఇచ్చిందన్నారు. ఏ రాష్టంలోనైనా మార్కెట్ల దగ్గరకు రైతులు వెళ్తారు- కానీ తెలంగాణలో మాత్రం మార్కెట్ నే రైతుల దగ్గరకు తీసుకుపోయామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లోవరి పంట ఉందా లేదా అని కేంద్రాన్ని బండి సంజయ్ అడిగి తెలుసుకోవాలన్నారు. గతంలో 60 లక్షల ఎకరాల్లో ధాన్యం వేశాము- ఇప్పుడు 60 నుంచి 80లక్షల ఎకరాల్లో ధాన్యం వేసేందుకు సిద్ధంగా ఉంచాం అన్నారు.
వచ్చే యాసంగిలో పంటను కొంటామని కేంద్రం నుంచి లెటర్ బండి సంజయ్ ఇప్పించాలన్నారు. ఇప్పటి వరకు వానాకాలం పంటను కొంటున్నాం, రైతులకు ఇప్పటివరకు 1000 కోట్ల రూపాయల కు పైగా ఖాతాల్లో వేశామన్నారు. బీజేపీ రాజకీయ ప్రస్తానమే అబద్ధాలతో కూడుకుందన్నారు. ధర్నా చౌక్ మేము ఎత్తివేయ్యలేదు- అక్కడి ప్రజలు వద్దన్నారు…. ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కోర్టు ఆదేశాలతో మళ్ళీ ధర్నా చౌక్ ధర్నాలకు అవకాశం వచ్చిందన్నారు.