నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేసీఆర్ పై అక్కసుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడమే కాకుండా రైతులకు నీళ్లు ఇవ్వకుండా పొలాలను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బురదరాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా నిలబడిందని అన్నారు.
తెలంగాణ జలవనరులు, ప్రాజెక్టలపై “నీళ్లు - నిజాలు” అనే అంశంపై తెలంగాణ జాగృతి సంస్థ శుక్రవాం నాడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మేధావులు, విశ్రాంత ఇంజనీర్లు పాల్గొన్నారు. అనంతరం పలు తీర్మానాలు ఆమోదించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజనీతజ్ఞతను ప్రదర్శించాలని సూచించారు. “వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్య శ్రీని కేసీఆర్ కొనసాగించారు.. కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోంది. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలి. సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్ లా పనిచేస్తున్నారు. కేసీఆర్ శతృవు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు.. కానీ మన జలాలను తరలిస్తున్న ఆంధ్రా పాలకులు మన శతృవులని ఆయన గమనించాలి.’’ అని వ్యాఖ్యానించారు. ఆంధ్ర కేడర్ లో పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్ ను ఇరిగేషన్ సలహదారు పదవి నుంచి తొలగించాలని, కృష్ణ ట్రైబ్యునల్ లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నాయకత్వంలో అవిశ్రాంతంగా పని చేస్తేనే కోటి ఎకరాల మాగాణంగా మారిందని, ఎంతో మంది మేధావుల, ఇంజనీర్ల కృషి ఫలతమే అనేక ప్రాజెక్టుల నిర్మాణమని తెలిపారు. తెలంగాణ సమగ్రాభివృద్ధిలో నీటి వనరులు ఒక ప్రధాన అంశంగా పెట్టుకొని ముందుకెళ్లామని, కానీ ఈ ప్రభుత్వం జలవనరుల రంగాన్ని విర్మిస్తున్నదని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్లందించారని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లలో కోటి ఎకరాలకుపైగా నీళ్లందించామని, కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని వివరించారు. మొత్తం కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా బిఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను పూర్తి చేశామని పేర్కొన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకొని 15 లక్షల ఎకరాలకు నీళ్లించుకోవడం జరిగిందని, కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నామని అన్నారు. అందుకు సాక్ష్యం తెలంగాణ ఏర్పడే సమయానికి 68 లక్షల టన్నుల వరి పండితే… 2022-23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం పండిందని, వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానానికి ఎదిగిందని స్పష్టం చేశారు. ఇన్ని చేసినా పదేళ్లలో ఏమి జరగలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.
గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు పరిపాలించి ప్రాజెక్టుల్లో పల్లేర్లు మొలిపించాయని, కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం ఫైరవీలు చేసుకున్నారు తప్ప ప్రాజెక్టుల కోసం కొట్లాడలేదని మండిపడ్డారు. గట్టిగా జై తెలంగాణ అంటే… వెంటనే ఫేక్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసేవారని గుర్తు చేశారు. “వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి మన జలాలను తరలించారు. అదే ఒరవడిని జగన్, చంద్రబాబు కొనసాగించారు. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల, పోలవరం- బనకచర్ల ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్, టీడీపీలే అన్యాయం చేశాయనుకుంటే… ఇప్పుడు వాటికి బీజేపీ తోడయ్యింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కేంద్ర బలగాలను మోహరింపజేశారు. కృష్ణా జలాల దోపిడీని ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఎస్, జగన్ కొనసాగించారు. ఇప్పుడు గోదావరి నదిపై కూడా ఆంధ్రా నాయకుల కన్ను పడింది. రాష్ట్రంలో తెలంగాణ సోయితో పరిపాలనం జరగడం లేదు.” అని వ్యాఖ్యానించారు.
Also Read:తెలంగాణ జాగృతి సమావేశం.. తీర్మానాలు
కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ధ్వజమెత్తారు. జలవనరుల విషయాల్లో ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా ఒక్కటవుతారని, కానీ తెలంగాణ మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఎండగట్టారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారని, నీళ్లు ఇవ్వక రైతుల పొట్టకొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారని ఉదాహరించారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదని చెప్పారు.

