కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. కేసీఆర్.. యావత్ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీ రోల్ పోషించిన ఉద్యమనేత. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన యోధుడు. చావు నోట్లో తలపెట్టి మరీ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అధికార కాంగ్రెస్ పార్టీని ఒప్పించి, ప్రతిపక్షాలను మెప్పించి.. తెలంగాణ ప్రజల ఆశ, శ్వాస అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సగర్వంగా సాధించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించాడు.
చంద్రశేఖర్ రావు కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. దీనివల్ల ఇతను చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించాడు. చాలా మంది చరిత్ర నుంచి ప్రభావితమవుతారు. కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. అలాంటి వారిలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకరు. తెలంగాణ సమాజాన్ని ఊగించి, ఉరికించి, శాసించి విజయతీరాలకు చేర్చారు. ఆయన ఉక్కు సంకల్పం, వ్యూహ చతురత ముందు ఆ విధి సైతం తలవంచింది. తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా అవతరించింది. సబ్బండ వర్గాలందరికీ గులాబీ జెండా నీడైంది. తెలంగాణ దశ దిశను మార్చిన ప్రియతమ నేత.. కేసీఆర్ ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు ఎమ్మెల్సీ కవిత.
ఒక్కడిగా మొదలై ప్రియతమ నేతగా ఎదిగిన క్రమంలో కొన్ని చిత్రాలు అంటూ ట్వీట్ చేశారు ఆమె తన తండ్రి సీఎం కేసీఆర్ ఉద్యమ ప్రస్థానంలోని ఫోటోలను గుర్తు చేసుకుంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఒక్కడిగా మొదలై, యావత్తు తెలంగాణను కదిలించి, తెలంగాణ దశ దిశను మార్చిన మన ప్రియతమ నేత కేసీఆర్ గారి ప్రయాణంలో కొన్ని చిత్రాలు…అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేశారు.ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.