మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నిరూపించారు మెకానిక్ ఆదిలక్ష్మి. అవును, తెలంగాణ తొలి మహిళా మెకానిక్ ఆదిలక్ష్మి. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు మెకానిక్ షాపు పెట్టిన ఆదిలక్ష్మికి వెన్నంటి నిలిచారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆదిలక్ష్మి కొత్త షాపునకు అత్యాధునిక మెషిన్లను అందిస్తానని, ఇద్దరు ఆడపిల్లలను చదివించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత.
అదిలక్ష్మి నేపథ్యం.. సుజాతనగర్ మండల కేంద్రం ఖమ్మం ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది ఓ టైర్ మెకానిక్ షెడ్డు. ట్రాక్టర్లు, లారీలు, పెద్ద పెద్ద చక్రాల బండ్లు అక్కడ ఆగుతాయి.. ఓ మహిళ బయటకు వచ్చి సమస్య ఏమిటని తెలుసుకుంటుంది.. పంచర్, టైర్ మార్పు.. పని ఏదైనా సరే చకచకా పని పూర్తి చేస్తుంది.. భర్తతో పాటు షెడ్డు నడుపుకుంటూ కుటుంబానికి ఆసరా నిలుస్తుంది. ఆమె పేరు ఆదిలక్ష్మి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత అంజనానపురానికి చెందిన ఆదిలక్ష్మిది, ఆర్థికంగా నిరుపేద కుటుంబం. భర్త మెకానిక్ గా పనిచేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించేవాడు. అయినా.. జీతం సరిపోయేది కాదు.ఆర్థిక ఇబ్బందులకు తాళలేక కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకున్నది ఆదిలక్ష్మి. భర్తతో కలిసి ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంది. అక్కడా ఇక్కడా అప్పు చేసి భార్యాభర్తలిద్దరూ సుజాతనగర్‌లో టైర్ వర్క్స్ షెడ్డు తెరిచారు. మెకానిక్ వర్క్ నేర్చుకుంటూ షెడ్డును తానే నడిపిస్తున్నది ఆదిలక్ష్మి. వాహనాలకు గ్రీజు పెట్టడం నుంచి వెల్డింగ్ పనులు, పంచర్ వేయటం వరకు అన్ని పనులూ చేస్తూ ఆదిలక్ష్మి శభాష్ అనిపించుకుంటున్నది.ఇప్పుడు తనే సొంతంగా కొత్త షాపు పెట్టుకోవాలని నిర్ణయించుకొని, సాయం కోసం ఎదురు చూస్తోంది.
అయితే ఆదిలక్ష్మి చేస్తున్న కృషి గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, నేరుగా మాట్లాడి అభినందనలు తెలిపారు. అంతేకాదు కొత్త షాపు కోసం కావల్సిన అధునాతన మెషిన్లను అందజేస్తానని ఎమ్మెల్సీ కవిత హామి ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితను ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు కలిసారు. ఆది లక్ష్మి షాపునకు అత్యాధునిక మెషిన్లను అందిస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. అంతేకాదు ఇద్దరు కూతుర్లను ఉన్నత చదువులు చదివిస్తానని ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. మహిళలు ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరని, ఆదిలక్ష్మి జీవితమే అందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. అడగకుండానే సాయం చేసి, ఇద్దరు బిడ్డలను చదివిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవితకు ఆదిలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.