కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటులో జాప్యమెందుకని నిలదీశారు. శనివారం ఉదయం తన నివాసంలో బీసీ సంఘాల నాయకులతో కలిసి ఫూలే విగ్రహ సాధన దీక్ష పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 8న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న విగ్రహ సాధన దీక్షకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అణచివేత, పీడన, అంటరానితనం లాంటి రుగ్మతలపై జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని.. ఆయన విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసి గౌరవించుకుందామని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలు సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం మహాత్మా ఫూలే విగ్రహ ఏర్పాటులో ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి పెంచేందుకే విగ్రహ సాధన దీక్ష చేపడుతున్నామని అన్నారు.
బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. పెంచిన రిజర్వేషన్ల అమలులో కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ లో రిజర్వేషన్‌లు పెంచుతూ బిల్లు పాస్ చేసినా కేంద్ర ప్రభుత్వం వద్దకు ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదో సమాధానం చెప్పి తీరాలన్నారు. కేంద్ర వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తే బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతాయన్న భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకంజ వేస్తున్నారని అన్నారు. తన పదవిని కాపాడుకునేందుకు అన్నిరకాలుగా అండగా నిలుస్తున్న ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రావొద్దన్నదే రేవంత్ ప్రయత్నం అన్నారు. అందుకే అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని కోల్డ్ స్టోరేజీలోకి పంపేస్తున్నారని వివరించారు. అసెంబ్లీలో పాస్ చేసిన తీర్మానం అమలు చేసే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెంట పడుతామని హెచ్చరించారు.
Also Read:పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన..
బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా వర్గాలను పూర్తిగా విస్మరించిందన్నారు. తన జీవితాంతం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహనీయుడు ఫూలే విగ్రహ ఏర్పాటు విషయంలో ఎందుకు భేషజాలకు పోతున్నారని ప్రభుత్వ పెద్దలను నిలదీశారు. దేశంలో అనేక సాంఘిక దురాచారాలు అమలవుతోన్న సమయంలోనే అంతరానితనం నిర్మూలన కోసం మహాత్మా ఫూలే ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. సామాజిక వివక్షను ఎదుర్కొంటున్న మహిళలకు సమానత్వం కోసం కృషి చేశారని.. తన సతీమణి సావిత్రి భాయి ఫూలేకు చదువు నేర్పించి ఆమె ద్వారా ఎందరో మహిళలకు ఆయన చదువు చెప్పించారని అన్నారు. ఆయనకు నివాళులర్పించడంతోనే పాలకుల బాధ్యత తీరదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. మహాత్మా ఫూలే ఆశయాలను అమలు చేసినప్పుడు మాత్రమే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టు అన్నారు. కేసీఆర్ గారి హయాంలో బీసీల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ లు ప్రవేశపెట్టి ఆయన స్ఫూర్తిని కొనసాగించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గురుకులాలు దెబ్బతిన్నాయని, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ లు, ఫీ రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ల కోసం విద్యార్థులు తంటాలు పడే పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ఫూలే విగ్రహ సాధన దీక్షకు అన్నివర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.