ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ తనపై దాడి చేశాడని హైదరాబాద్ నాంపల్లి పోలీసు స్టేషన్‌లో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ ఫిర్యాదు చేశారు. అంతుల్ వాసే అనే ఎన్నారైకి హైదరాబాద్ నాంపల్లిలో ఓ సొంత ఇల్లుంది. గడిచిన పదేళ్లుగా ఫారూఖ్ హుస్సేన్ ఆ ఇంట్లోనే అద్దెకుంటున్నారు.
అయితే, ఇప్పటికీ అతను నామమాత్రపు అద్దె మాత్రమే చెల్లిస్తున్నాడని, నిలదీసి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇంటి యజమాని అంతుల్ చెప్పారు.
విదేశాల నుంచి ఆదివారమే హైదరాబాద్‌కు వచ్చిన యజమానురాలు అంతుల్.. తన సోదరుడితో కలిసి ఈ రోజు ఉదయం నేరుగా నాంపల్లిలోని ఇంటికి వెళ్లింది. ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా ఫారూఖ్‌ను కోరింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో ఆమె పోలీసులను ఆశ్రయింది. అద్దె ఇవ్వను, అపార్ట్‌మెంట్ ఖాళీ చేయనని, ఏం చేసుకుంటావో చేసుకో, ఎవడికి చెప్తావో చెప్పుకో అని ఫారూఖ్ బెదిరించినట్లు బాధిత మహిళ ఆరోపించింది. ఒక దశలో ఎమ్మెల్సీ ఫారూఖ్ మహిళను చెప్పుతో కొట్టినట్లు కూడా ఫిర్యాదు లో పేర్కొంది. తనపై దాడికి పాల్పడిన ఫరూక్ హుస్సేన్‌పై చర్యలు తీసుకొని తన ఇంటిని తనకు అప్పగించాలని ఆమె పోలీసులను కోరారు.