చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా కార్తీక్ రెడ్డి?

285
Karthik Reedy
- Advertisement -

మాజీ హోం మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆమె తన ఇద్దరు కుమారులు, కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డిలతో కలిసి నిన్న సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు . దాదాపు రెండు గంటల పాటు సీఎం కేసీఆర్ తో వారు భేటీ అయ్యారు . ఈసమావేశంలో వారు మహేశ్వరం నియోజకవర్గ అభివృద్దిపై సబిత చర్చించినట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు సీఎం కేసీఆర్‌తోనే ఆమె చెప్పినట్టు సమాచారం. సీఎం తో భేటి తర్వాత మీడియాతో మాట్లాడారు సబితా ఇంద్రారెడ్డి. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపుకోసం కృషి చేస్తామని తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగానే కలిశామన్నారు కార్తీక్ రెడ్డి. త్వరలో చేవెళ్లలో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి టీఆర్‌ఎస్‌లో చేరుతామని ఆయన వెల్లడించారు.

పార్టీలో చేరేకంటే ముందు సబితకు సీఎం కేసీఆర్ స్పష్టమైన హామి ఇచ్చినట్టు తెలుస్తుంది. సబితకు మంత్రి పదవి కన్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ కూడా ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక కార్తీక రెడ్డి 2014లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కార్తీక్ రెడ్డి రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవ్వగా..మహాకూటమిలో భాగంగా ఆటికెట్ ను టీడీపీకీ కేటాయించారు. దీంతో అప్పుడే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కార్తీక్ రెడ్డి. ఇక టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్ధుల జాబితా మరో రెండు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో కార్తీక రెడ్డి పేరు ఉంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

ఒకవేళ కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తే ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న ప్రముఖ పారశ్రామిక వేత్త, సీనియర్ నాయకుడు రంజీత్ రెడ్డిని సికింద్రబాద్ పార్లమెంట్ స్ధానం నుంచి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. లేదంటే రంజిత్ రెడ్డికి చేవెళ్ల టికెట్ ఇస్తే కార్తీక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే సీఎం కేసీఆర్ కార్తీక్ రెడ్డికి ఎమ్మెల్సీ లేదా ఎంపీ ఈరెండింటిలో ఏదో ఒక స్పష్టమైన హామి ఇచ్చినట్టు తెలుస్తుంది.

- Advertisement -