ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేస్తానని చెప్పారు నగరి ఎమ్మెల్యే రోజా. ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఎక్కువ సంఖ్యలో తయారయ్యేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ ఎలాగైతే పెద్ద పీట వేస్తున్నారో, అలాగే, ఏపీఐఐసీ ద్వారా కూడా చేస్తానని, వాళ్లను కూడా ముందుకు తీసుకెళ్లేందుకు పాటుపడతానని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడతామన్నారు.
జగన్ పాలన ఎంత పారదర్శకంగా, అవినీతి రహితంగా ఉంటుందో అదే విధంగా ఏపీఐఐసీ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం భూ కేటాయింపుల్లో, రాయితీల్లో చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు లోకేశ్ దోచుకున్నారని ఆరోపించారు. వాళ్లిద్దరూ దోచుకున్న వాటన్నింటినీ బయటకు తీస్తామని అన్నారు. కచ్చితంగా, న్యాయబద్ధమైన పారిశ్రామికవేత్తలకు ఆ భూములను కేటాయించేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.