బీజేపీ అంటే బడా జూతా పార్టీ అని మరోసారి తేలిపోయిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా పసుపు బోర్డుపై కేంద్ర వైఖరిపై ప్రశ్నించారు. పసుపు బోర్డుపై కేంద్ర వ్యవసాయ మంత్రి రైతుల నోట్లో మట్టి కొట్టే సమాధానం ఇచ్చారు. తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని చెప్పడం దుర్మార్గమని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ అరవింద్ పసుపు బోర్డు, ఎర్ర జొన్నకు మద్దతు ధర ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ ఇచ్చారు. చిత్తశుద్ధి ఉంటే అరవింద్ రాజీనామా చేసి రైతు ప్రజా ఉద్యమంలో పాల్గొనాలి.. లేకుంటే నిజామాబాద్ జిల్లా రైతాంగం తరిమి తరిమి కొడతారు. బీజేపీ అంటే బడా జూతా పార్టీ అని మరోసారి తేలిపోయింది. ఇక కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి విషయంలో అవాకులు చెవాకులు పేలుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వరి సాగులో నెంబర్ వన్ గా ఉంది. విద్యుత్ ఉత్పత్తి, సాగునీరు, రైతు బంధు ఇవ్వడంలో నెంబర్ వన్ గా ఉన్నాం..బీజేపీ, కాంగ్రెస్ దొందుదొందే..బీజేపీ అమ్మకం పార్టీగా మారిందని అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు.