BJP అంటే ‘భారతీయ జగడాల పార్టీ’- ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

70
MLA Jeevan Reddy
- Advertisement -

కుటుంబ రాజకీయాల గురించి ప్రధాని మోడీ గురివిందలా మాటలు మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందందటూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. కుటుంబ రాజకీయాల గురించి మోదీ మాటలు గురివింద సామెతను తలపింపచేస్తున్నాయని విమర్శించారు. అంతేకాదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ బీజేపీ నేతలు కుటుంబ పాలన సాగిస్తున్నారో ఓ మ్యాప్‌ను కూడా జీవన్ రెడ్డి మీడియాకు ప్రదర్శించారు. వారసత్వ రాజకీయాలకు అడ్డా కమలదళం అంటూ మీడియాలో వచ్చిన ఓ కథనం తాలూకు క్లిప్పింగ్‌ను కూడా చూపించారు.

అనురాగ్ ఠాకూర్ కుటుంబం, పియూష్ గోయల్ కుటుంబం, ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబం, జ్యోతిరాదిత్య సింథియా కుటుంబం… ఇలా దేశం మొత్తమ్మీద 30 వరకు బీజేపీ నేతలు కుటుంబ పాలన చేస్తున్నారని జీవన్ రెడ్డి వివరించారు. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు బీసీసీఐ సెక్రటరీగా ఉన్నారని తెలిపారు. యూపీలో బీజేపీ పొత్తులు పెట్టుకున్న అప్నాదళ్ వంటి పార్టీలు కుటుంబ పార్టీలు కాదా? అని ప్రశ్నించారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు.. టీడీపీ కుటుంబ పార్టీయే కదా! కశ్మీర్ లో పీడీపీ కుటుంబ పార్టీయే కదా!” అని జీవన్ రెడ్డి వివరించారు.

మీరు ఈ విధంగా పొత్తులు పెట్టుకుని, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు దేశద్రోహులు అంటున్నారు. కుటుంబ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న మీ పార్టీ దేశద్రోహుల పార్టీ కాదా? అంటూ జీవన్ రెడ్డి ప్రధాని మోదీని నిలదీశారు. బీజేపీ అంటే ‘భారతీయ జగడాల పార్టీ’గా మారిపోయిందని అభివర్ణించారు. మోదీ గారి ‘ఈడీ’యిజానికి, అమిత్ షా ‘ఐటీ’యిజానికి తెలంగాణలో భయపడేవారెవ్వరూ లేరని, తెలంగాణలో కేసీఆర్ యిజమే చెల్లుతుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -