న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తమ జట్టు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఫేవరెట్ కాదనే విషయాన్ని స్పష్టంగా అంగీకరించాడు. అయితే అండర్‌డాగ్‌గా ఉండటం తమకు ఎలాంటి సమస్య కాదని, మంచి ప్రదర్శన చేస్తే ట్రోఫీ గెలిచే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య దేశం అయిన భారత్‌ను ఎదుర్కొనబోతోంది. టోర్నమెంట్ మొత్తం మీద భారత్ చూపించిన ప్రదర్శన, అలాగే స్వదేశంలో మ్యాచ్ జరగడం వల్ల భారత్‌ను ఫేవరెట్‌గా భావిస్తున్నారు. అయినప్పటికీ న్యూజిలాండ్ జట్టు ఈ ఒత్తిడిని పెద్దగా పట్టించుకోవడం లేదని సాంట్నర్ తెలిపారు.
ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్ ఎప్పుడూ అంచనాలకు మించి ప్రదర్శన చేస్తూ ఉంటుంది. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లేదా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో కివీస్ జట్టు తరచుగా సెమీఫైనల్ లేదా ఫైనల్ వరకు చేరుతుంది. ముఖ్యంగా మొదటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి టైటిల్ గెలవడం వారి గొప్ప విజయంగా నిలిచింది. గత ఏడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలిచింది.
ఈసారి జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో కూడా న్యూజిలాండ్ జట్టు అనూహ్యంగా మంచి ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది. శ్రీలంకపై పాకిస్తాన్ 65 పరుగుల తేడాతో గెలవలేకపోవడం వల్ల కివీస్ జట్టు నాకౌట్ దశకు చేరింది. అక్కడ ఫేవరెట్‌గా ఉన్న దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో తుది పోరుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్‌ను ఫేవరెట్‌గా ఎవరూ భావించడం లేదు. అయితే తమ ఆటగాళ్లు తమ తమ పాత్రలను సమర్థంగా పోషిస్తే ట్రోఫీ గెలవగలమని సాంట్నర్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read:టీ20 వరల్డ్ కప్ ఫైనల్..స్పెషల్ ట్రైన్స్
మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో సాంట్నర్ మాట్లాడుతూ…ఈ మ్యాచ్ చాలా పెద్ద సవాలు. అందరికీ తెలుసు, మేము ఫేవరెట్ కాదు. కానీ అది మాకు సమస్య కాదు. మేము మా చిన్న చిన్న విషయాలను సరిగ్గా చేస్తూ, జట్టుగా బలమైన ప్రదర్శన ఇస్తే మంచి స్థితిలోకి వచ్చి ట్రోఫీ గెలిచే అవకాశం ఉంటుంది. ఈసారి ట్రోఫీ గెలవడానికి కొందరి హృదయాలను బాధ పెట్టాల్సి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు.

