మిషన్ కాకతీయ మీడియా అవార్డులకు ఎంట్రీలు పంపేందుకు చివరితేదీ ఈ నెల 31 అని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కార్యాలయం మంగళవారం తెలిపింది. విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ పథకం గురించి ఎంతో సహకరించిన జర్నలిస్టులను సత్కరించేందుకు అవార్డులను ప్రకటించనున్నట్లు మంత్రి హరీశ్ రావు ఒఎస్‌డి శ్రీధర్‌రావు దేశ్‌పాండే మంగళవారం తెలిపారు.
మిషన్ కాకతీయ గురించి అద్భుతంగా కధనాలు రాసిన పత్రికా జర్నలిస్టులు, ప్రసారం చేసిన టివి జర్నలిస్టులను, వార్తా సంస్థలకు తగిన రీతిలో అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ జన జీవితంపై మిషన్ కాకతీయ పథకం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై ఎంట్రీలను పంపించాల్సిందిగా ఆయన కోరారు. 2017 జనవరి 1 నుంచి 2017 డిసెంబర్ 31 వరకు పత్రికల్లో అచ్చయిన, టివి న్యూస్ చానెళ్లలో ప్రసారమైన కథనాలు స్వీకరిస్తామని ఆయన వెల్లడించారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలను పంపించేందుకు చివరి తేదీ 2018 జనవరి 31 అని శ్రీధర్ చెప్పారు.
ఎంట్రీలు పంపించేవారు కేటగిరీల వారీగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఆన్‌లైన్ మీడియా, వీడియో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, ఫ్రీలాన్సింగ్, విశే్లషణాత్మక, పరిశోధనాత్మక, డాక్యుమెంటరీ, షార్ట్ఫిల్మ్ పంపించాలి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మూడు విభాగాలుగా మూడు బహుమతులు ఇస్తున్నట్లు వెల్లడించారు. మొదటి బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.75 వేలు, మూడో బహుమతి రూ.50 వేల చొప్పున ప్రదానం చేస్తామని వివరించారు. మిగిలిన కేటగిరిలకు విడిగా బహుమతులు ఉంటాయని వివరించారు.
ఎంట్రీలతోపాటు ఆయా వార్తలు, విశే్లషణల క్లిప్పింగ్‌లను తప్పనిసరిగా పంపించాలని తెలిపారు. ఎంట్రీలను శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఓఎస్‌డి, ఇరిగేషన్ శాఖ, డి-బ్లాక్, గ్రౌండ్‌ఫ్లోర్, సచివాలయం, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం చిరునామాకు పంపించాలని తెలిపారు.