పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,హైదరాబాద్ లోని అరణ్య భవన్‌లో రాష్ట్రంలో ఏకో – టూరిజం అభివృద్ధిపై పర్యాటక – అటవీ శాఖ ఉన్నతస్థాయి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీశాఖ పరిధిలోని టూరిజం ప్రాంతాల్లో పర్యాటకుల సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రులు అటవీ, పర్యాటక శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఎకో టూరిజం అభివృద్ధిపై చర్చించారు. కవ్వాల్ జంగిల్ సఫారీ, లక్నవరం, పాకాల చెరువులు,బోగత వాటర్ ఫాల్స్, మల్లూర్ ట్రెక్కింగ్ పాత్ వే లు, ఫర్హాబాద్ ఎకో సర్యూట్ పార్కుల అభివృద్దిపై ప్రత్యేకంగా చర్చించారు.
రిజర్వాయర్లలో టూరిజాన్ని అభివృద్ధి చేసి పర్యాటకుల కోసం మరిన్ని బోట్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. టైగర్ రిజర్వ్ జోన్లు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, శాంక్చూరీలు ఉన్న చోట అటవీ శాఖ అనుమతులు తీసుకుని అభివృద్ది పనులు చేపట్టాలన్నారు. కడెం రిజర్వాయర్‌లో కొత్త బోట్లను ఏర్పాటు చేయాలని ఎమ్యెల్యే రేఖా శ్యాంనాయక్ మంత్రులను కోరగా.. తగిన ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ అధికారులకు మంత్రులు సూచించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రేఖా శ్యాంనాయక్, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావు , దివాకర్ రావు, ఆత్రం సక్కు, అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు , అటవీశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, పర్యాటక శాఖ కార్యదర్శి కేఎస్. శ్రీనివాస రాజు, పీసీసీఎఫ్ సోషల్ ఫారెస్ట్రీ ఆర్.యం. డోబ్రియల్, పర్యాటక శాఖ ఎండీ మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.