ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సంబంధిత శాఖ అధికారులతో ఎర్రమంజిల్ ఆర్ అండ్ బి కార్యాలయంలో వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.రోడ్లకు ఇరువైపులా ఆహ్లాదకరమైన రంగు రంగుల మొక్కలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి ఈ సందర్భంగా అధికారులతో అన్నారు.రోడ్డు పై ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు ప్రకృతిని ఆస్వాదించే విధంగా,చూపరులను ఆకట్టుకునే విధంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కోరిక అన్నారు.హరితహారంలో భాగంగా ఆర్ అండ్ బి శాఖ పెద్ద ఎత్తున మొక్కలు నాటి,వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నేషనల్ హైవేలపై “హైవే నర్సరీలు” ఏర్పాటు చేయాలన్నారు.
హైవేలపై నర్సరీలు పెంచడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో గల రోడ్లపై 20 అనువైన స్థలాలను గుర్తించాలని,ఆర్ అండ్ బి ఆధీనంలో ఉన్న నేషనల్ హైవేలపై 25 నర్సరీల స్థలాలు గుర్తించాలని అన్నారు.వీటికి “హైవే నర్సరీలు”గా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు.నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో 800 కి.మీ మేర రోడ్లకు ఇరువైపులా మరియు సెంట్రల్ మీడియంలో ఈ సారి హరితహారం కార్యక్రమంలో 3.30 లక్షల మొక్కలు నాటి,వాటిని సంరక్షించేందుకు పూర్తి బాధ్యత తీసుకుంటామని NHAI తెలంగాణ రీజినల్ ఆఫిసర్ కృష్ణ ప్రసాద్ మంత్రి తో అన్నారు.స్టేట్ పరిధిలోని నేషనల్ హైవే లపై 300 కి.మీ రోడ్లపై 50 వేల మొక్కలు,25 కలెక్టరేట్లో 1000 మొక్కలు చొప్పున మొత్తం 75 వేల మొక్కలు ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి మంత్రి కి చెప్పారు.అలాగే ఆర్ అండ్ బి శాఖ అధీనంలో ఉన్న 20 గెస్ట్ హౌస్ లలో నర్సరీలు పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు.