తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఎంపికైన 462 మంది వెటర్నరీ అసిస్టెంట్‌లకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫిశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం నియామక ఉత్తర్వులను అందజేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి అభ్యర్థులకు ఉత్తర్వులను అందజేసిన సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. మీ తల్లిదండ్రుల ప్రోత్సహం, మీ కృషి ఫలితంగానే నేడు ప్రభుత్వ ఉద్యోగం లభించిందని ఆయన అన్నారు.
ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పశుసంవర్ధకశాఖలో ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడం ఇదే ప్రప్రధమం అని తెలిపారు. గతంలో ఆదరణ లేని పశుసంవర్ధక శాఖ నేడు అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖగా గుర్తింపును సాధించిందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్దతో పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి కార్యక్రమాలను కోట్లది రూపాయల ఖర్చుతో చేపట్టడమేనని ఆయన అన్నారు. ప్రధానంగా 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో యాదవ, కురుమలకు గొర్రెల పంపిణీ విజయవంతంగా కొనసాగుతుందని వివరించారు. జీవాలకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో 1962 టోల్ ప్రీ నెంబర్‌తో నియెజకవర్గానికి ఒక సంచార పశువైద్యశాలను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.
అంతేకాకుండా వచ్చే వారంలో 890 కోట్ల రూపాయల వ్యయంత సబ్సిడీపై పాడిగేదెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా పశువైద్యశాలల అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. జీవాలకు సేవ చేసే అదృష్టం అందరికి లభించదని, అది మీకు దక్కిందని వారిని మరోమారు మంత్రి అభినందించారు. పనిచేసే చోట మెరుగైన సేవలు అందించడం ద్వారా రైతుల మెప్పును పొందాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక కార్యదర్శి సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, టీఎస్‌ఎల్‌డీఏ సీఈఓ మంజువాణి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్‌లు పాల్గొన్నారు.