చిరుతో మంత్రి తలసాని భేటీ..

226
chiru
- Advertisement -

జూబ్లిహిల్స్ లోని ప్రముఖ నటుడు చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖులతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, షూటింగులు ఎప్పటి నుంచి ప్రారంభం కావాలనే విషయంపై ప్రభుత్వం నుంచి ఏదో ఒక సమాధానం రావాలి అనే దానిపై సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వం అన్ని రంగాలకు లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తోందని అన్నారు. అయితే, సినీ రంగం భవిష్యత్తు ఏమిటనే సందేహం అందరిలో ఉందని చెప్పారు.

కరోనా వ్యాప్తికి కారణం కాకూడదనే భావనతో, ప్రభుత్వ సహకారంతో షూటింగులు చేసుకోవాలనేది తమ అభిమతమని చెప్పారు. ఇది కేవలం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల కోసమో, లేదా షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాల కోసమో చేస్తున్న తాము చేస్తున్న విన్నపం కాదని… షూటింగులు జరిగితే కానీ బతుకులు ముందుకు సాగని 14 వేల మంది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చేస్తున్న విన్నపమని చెప్పారు. 14 వేల మందిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరుతున్నామని అన్నారు.

ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్,సురేష్ బాబు, సి.కళ్యాణ్,దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి, వ్.వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్‌. శంకర్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -