అంగన్ వాడీ సేవలు అద్భుతం- మంత్రి సత్యవతి

356
minister satyavathi rathod
- Advertisement -

ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ లో అంగన్ వాడీల పిల్లలు ఇంటి వద్దే ఉండే విజ్ణానాన్ని, ఆహ్లాదాన్ని పొందే చిన్న చిన్న కథలతో రూపొందించిన ఆన్ లైన్ పాఠ్యాంశాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేడు మహిళా -శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. కరోనా కట్టడి చేసే ఈ లాక్ డౌన్ సమయంలో అంగన్ వాడీలలో పనిచేసే టీచర్లు, ఆయాలు, అంగన్ వాడీ లబ్దిదారులకు అందుతున్న సరుకులు,సేవలపై మంత్రి సత్యవతి రాథోడ్ మహిళా-శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, ఇతర అధికారులతో సమీక్ష చేశారు.

అంగన్ వాడీ సిబ్బందికి రెండో విడత మాస్క్ లను మహిళా శిశు సంక్షేమ శాఖలోని ఉమెన్ కార్పోరేషన్ ద్వారా తయారు చేయించి, నేడు మంత్రి ఆయా జిల్లాల సీడీపీవోలకు పంపిణీ చేశారు. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరి బ్రాండ్ పేరుతో తయారు చేసిన శానిటైజర్లను కూడా రెండో విడతలో భాగంగా అంగన్ వాడీ సిబ్బంది కి అందించారు. చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ సందర్భంగా దుకాణాలు అందుబాటులో లేకపోవడం, పని చేయకపోవడం వల్ల ఆర్ధిక ఇబ్బందుల వల్ల మహిళలు, ఎదిగిన బాలికలు వారికి అత్యవసరమైన ప్యాడ్ల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రోక్టర్ అండ్ గ్యాంబల్ కంపెనీ రెండు లక్షల ప్యాడ్లను అందించడంతో, వాటిని నేడు మంత్రి సత్యవతి రాథోడ్ స్వదార్ హోమ్, సఖీ సెంటర్లకు, కనీస సదుపాయాలు లేని గిరిజన ప్రాంతాలకు పంపిణీ చేశారు.

రాష్ట్రంలోని 10 చిల్డ్రన్ హోమ్, 21 ఓల్డేజ్ హోమ్స్ కు అవసరమైన దాదాపు 15 లక్షల రూపాయల విలువైన సరుకులు అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ సమకూర్చడంతో సంస్థ తెలంగాణ హెడ్ శ్రీనివాస్, సిబ్బంది ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ నేడు వాటిని ఆయా హోమ్స్ కు పంపిణీ చేశారు. ఫౌండేషన్ తరపున గిరిజనులకు, మహిళలకు మరింత చేయుత అందించాలని, ఈ కరోనా కష్టకాలంలో ఫౌండేషన్ ద్వారా వారి నిత్యావసరాలు, అత్యవసరాలు తీర్చేందుకు సహకరించాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరిక మేరకు మరింత సేవ చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో అంగన్ వాడీలకు, నిత్యావసరాలు, మాస్క్ లు, శానిటైజర్లు, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు కూడా నిత్యావసరాలు అందించామన్నారు. దాదాపు గా ఇప్పటికే తెలంగాణలో 10 కోట్ల రూపాయల విలువైన సరుకులు, మాస్క్ లు, శానిటైజర్లు అందిచామన్నారు. ఎప్పటికప్పుడు టెలి కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అంగన్ వాడీ ద్వారా అందే సేవలు లబ్దిదారులకు ఈ కష్టకాలంల ఆగకుండా చూడాలని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. అదేవిధంగా అంగన్ వాడీలు కూడా మంచి సేవలు అందిస్తున్నారని, వారందరిని అభినందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉమెన్ కార్పోరేషన్ ఇన్ ఛార్జీ సబిత, జాయింట్ డైరెక్టర్ లక్మీ, అనురాథ, అసిస్టెంట్ డైరెక్టర్ గిరిజా, పద్మజా, రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి మోతి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -