స్మృతి ఇరానీతో మంత్రి సత్యవతి రాథోడ్ భేటీ..

592
Smriti Irani
- Advertisement -

ఢిల్లీలో కేంద్ర మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కలిశారు. తెలంగాణ రాష్ట్ర సమస్యలపై మంత్రి వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో స్త్రీ-శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్,ఎంపీ మాలోత్‌ కవిత తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మహిళా-శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, శిశువుల సమగ్ర వికాసం, అభివృద్ధికోసం రాష్ట్రంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఒంటరి మహిళలకు పెన్షన్లు, కేసిఆర్ కిట్లు, ఆరోగ్య లక్ష్మీ, మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు వంటి పథకాలు అమలు చేస్తోందన్నారు. కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయి సహకారం కావాలని కోరారు మంత్రి సత్యవతి రాథోడ్‌. అందులో ప్రధానంగా 5 అంశాలను చర్చించారు.

1.ప్రస్తుతం కేంద్రం 11 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు మాత్రమే పౌష్టికాహారం అందించాలని నిబంధన పెట్టింది. కానీ రాష్ట్రంలో 18 ఏళ్లలోపు ఉన్నబాలికలకు కూడా పౌష్టికాహార లోపం ఉందని సర్వేలు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్ల బాలికలకు కూడా పౌష్టికాహారం ఇస్తోంది. అయితే కేంద్రం కూడా ఈ వయో పరిమితిని 11 నుంచి 18 ఏళ్ల వరకు విస్తరించాలన్నారు.

2.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. ఇందుకోసం మొదటి దశలో 15 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఇవ్వమని కోరగా, కేవలం 5 హాస్టళ్లను మాత్రమే మంజూరు చేశారు. మిగిలినవి కూడా వెంటనే ఇవ్వాలన్నారు.

minister satyavathi

3.మహిళల అన్ని సమస్యలకు ఒకే కేంద్రంలో పరిష్కారం చూపే సఖీ సెంటర్లు రాష్ట్రంలో ప్రస్తుతం 31 మాత్రమే మంజూరు చేశారు. కొత్తగా ఏర్పడిన 2 జిల్లాలకు ఇంకా సఖీ కేంద్రాలను ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే హైదరాబాద్ వంటి అత్యధిక జనాభా ఉన్న జిల్లాలో ఒకే సఖీ కేంద్రం ద్వారా అందరికీ ఈ సెంటర్లు అందుబాటులో ఉండడం లేదు. కాబట్టి హైదరాబాద్ జిల్లాకు మరో రెండు సఖీ కేంద్రాలను ఇవ్వాలని కోరారు.

4.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లలను రక్షించాలనే లక్ష్యంతో బేటి బచావో-బేటి పడావో కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ అమలు చేస్తోంది. అయితే ఈ పథకం రాష్ట్రంలోని కేవలం 8 జిల్లాలకు మాత్రమే కేంద్రం పరిమితం చేసింది. రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపుగా అన్ని జిల్లాలో అమ్మాయిల-అబ్బాయిల లింగ నిష్పత్తిలో వ్యత్యాసం చాలా ఉంది. దీనిని నివారించాలంటే ఈ పథకాన్ని మిగిలిన 25 జిల్లాలకు కూడా విస్తరించాలని కోరారు.

5.చిన్న పిల్లల హక్కులను కాపాడుతూ, వారిని సంరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలను తెలిపే జువెనైల్ చట్టం కింద రాష్ట్రంలోని శిశువుల సంరక్షణ కోసం 2 చిల్ట్రన్ హోమ్స్ కావాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాము. వీటికి ఇంకా మంజూరు ఇవ్వలేదు. చిన్న పిల్లల సంరక్షణలో భాగంగా తొందరగా 2 చిల్డ్రన్ హోమ్స్ మంజూరు చేయమని కోరారు.

- Advertisement -