మాసబ్ ట్యాంక్ లోని డి ఎస్ ఎస్ భవన్‌లో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి పథకం ప్రోగ్రామ్‌లో అర్హులైన డ్రైవర్ కమ్ ఓనర్ స్కిం ద్వారా లబ్ది పొందిన 52 మందికి కార్‌లను మంత్రి సత్యవతి రాథోడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెనహార్ మహేష్ ఎక్కా , అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాధోడ్ మాట్లాడుతూ.. నేను మంత్రి అయిన తర్వాత ఇలాంటి చక్కని పథకాన్ని ప్రారంభం చేయడం ఆనందంగా ఉంది. గిరిజన సంక్షేమాన్ని మిగిలిన సంక్షేమశాఖలకు మించి అమలు చేయాలి.ట్రైకార్ ద్వారా 52 మందికి రాయితీతో కూడిన ఓన్ ఏ కార్ పథకం అందించడం హర్షణీయం అని మంత్రి అన్నారు.
నా మీద నమ్మకం ఉంచి తండాకు చెందిన నన్ను ఈ శాఖకు మంత్రి చేయడం అదృష్టం. గిరిజనులు అందరికీ న్యాయం చేస్తాను. మంచి లక్ష్యంతో ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారు తమ జీవితాలను మెరుగు పరచుకోవలి. గ్రామాలు.. తండాల నుంచి నగరానికి వలస వచ్చిన వారికి సరైన ఉపాధి అవకాశం లభించక ఇబ్బందులు పడేవారు.
ఆ పరిస్థితుల నుంచి బయట పడేందుకు ఈ పథకం ద్వారా వచ్చిన సహాయాన్ని ఉపయోగించుకొండి. గిరిజన మహిళలకు కూడా తగిన విధంగా సహాయం అందిస్తామని.. పురుషుల కన్నా మెరుగైన పథకాలు గిరిజన మహిళలకు అమలు చేస్తాం. తెలంగాణకు ముందు ఆ తర్వాత అనే రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు.
ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. నాలుగున్నర లక్షల ప్రయోజనం ఈ పథకం ద్వారా యువతకు లభిస్తుంది. ఎవరైతే లబ్ధిదారులుగా సహాయం పొందుతారో వారికి తగిన విధంగా శిక్షణ ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వర్గాలకు మేలు జరిగేలా ప్రభుత్వం పధకాలు అమలు చేస్తోంది. మద్యం తాగి వాహనాలు నడిపి ఇబ్బందులు పడొద్దని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు.
కార్యదర్శి బెనహార్ మహేష్ ఎక్కా మాట్లాడుతూ.. ఐదు వందల మంది యవతకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు కార్ల పంపిణీ చేస్తున్నాం. గిరిజన సంక్షేమశాఖ ద్వారా అర్హులైన వారందరికీ సహాయం లభిస్తుంది. ఈ పధకం ద్వారా ఆర్ధిక సహాయం పొందేవారు దానిని సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.